ఎఫ్‌పీవోకు ఎస్‌బీఐ రెడీ
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల విక్రయం లేదా ఎఫ్‌పీవోను చేపట్టాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా రూ. 9,576 కోట్లను(153 కోట్ల డాలర్లు) సమీకరించాలని నిర్ణయించినట్లు బీఎస్‌ఈకి బ్యాంక్ వెల్లడించింది. దీంతోపాటు ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన షేర్లను కేటాయించడం ద్వారా మరో రూ. 2,000 కోట్లను సైతం అందుకోవాలని ప్రణాళికలు వేసినట్లు తెలిపింది. ప్రస్తుతం ఎస్‌బీఐలో ప్రభుత్వానికి 62.31% వాటా ఉంది. అయితే 26 ప్రభుత్వరంగ బ్యాంకులలో తమ వాటా 58%కంటే తగ్గకుండా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకుంది.కాగా, తమ ప్రతిపాదనలకు వాటాదారులు, రిజర్వ్ బ్యాంక్‌లతోపాటు ప్రభుత్వ అనుమతులు అవసరమని బ్యాంక్ పేర్కొంది. ఇందుకు అనుగుణంగా ఈ నెల 30న వాటాదారుల సమావేశాన్ని నిర్వహించేందుకు నిర్ణయించింది.
నిధుల సమీకరణలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికల్లా బాండ్ల విక్రయం ద్వారా రూ. 5,000 కోట్లను సమీకరించనున్నట్లు బ్యాంక్ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య ఇప్పటికే ప్రకటించారు.