యావజ్జీవంగా దర్మపురి కేసు
* ఉరి రద్దు!
* ముగ్గురు నిందితులకు శిక్ష తగ్గింపు
* విద్యార్థినుల కుటుంబాల ఆవేదన
సాక్షి, చెన్నై : ధర్మపురిలో బస్సు దగ్ధం, ముగ్గురు విద్యార్థినుల సజీవ దహనం కేసులో ముగ్గురికి విధించిన ఉరి శిక్ష రద్దు అయింది. యావజ్జీవంగా శిక్షను మారుస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ విద్యార్థినుల కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అవినీతి కేసులో అన్నాడీఎం కే అధినేత్రి జె జయలలితకు 2000 సంవత్సరంలో ఏడాది జైలు శిక్ష పడ్డ విషయం తెలిసిందే.
ఈ తీర్పుతో అన్నాడీఎంకే వర్గాల్లో ఆక్రోశం రగిలింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాల బయలు దేరాయి. ఈ సమయంలో ధర్మపురి సమీపంలో అన్నాడీఎంకే వర్గాల వీరంగం రాష్ట్రాన్నే కుదిపి వేసింది. తమ అమ్మకు జైలు శిక్ష పడ్డ వీరావేశంతో అన్నాడీఎంకే వర్గాలు కోయంబత్తూరుకు చెందిన వ్యవసాయ కళాశాల బస్సుకు నిప్పు పెట్టారు. ఎంతో ఆనందంగా విహార యాత్రను ముగించుకుని తిరుగు పయనంలో ఉన్న విద్యార్థినుల్ని మంటలు చుట్టుముట్టడంతో బయట పడేందుకు తీవ్రంగా శ్రమించారు. కొందరు గాయాలతో బయట పడగా, కోకిల వాణి, గాయత్రి, హేమలత సజీవ దహనమయ్యారు.
ఈ ఘటనతో రాష్ట్రంలో పెను కలకలం బయలు దేరింది. ఈకేసులో ముఫ్పై మంది వరకు అరెస్టు అయ్యారు. వీరిలో అన్నాడీఎంకేకు చెందిన ధర్మపురి నాయకులు నెడుంజెలియ న్, రవీంద్రన్, మునియప్పన్‌లకు ఉరి శిక్ష విధిస్తూ సేలం కోర్టు 2007లో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును మద్రాసు హైకోర్టు ధ్రువీకరించింది. తదుపరి సుప్రీం కోర్టు సైతం తీర్పును ధ్రువీకరించడంతో సేలం కేంద్ర కారాగారంలో శిక్షను ఈ ముగ్గురు అనుభవిస్తున్నారు. తమకు క్షమాభిక్ష పెట్టాలని రాష్ర్టపతికి చేసుకున్న వి న్నపం పెండింగ్‌లో ఉంది. ఈ పరిస్థితుల్లో రాజీవ్ హ త్య కేసు నిందితుల ఉరి శిక్ష యావజ్జీవంగా మారడం తో ఈ ముగ్గురు మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
ఉరి రద్దు..యావజ్జీవం: తమకు విధించిన ఉరి శిక్ష తీర్పును పునస్సమీక్షించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రంజన్ గోగయ్, అరుణ్ మిశ్రలతో కూడిన బెంచ్ విచారిస్తూ వస్తున్నది. విచారణ గత వారం రోజులుగా వేగం పెరిగింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది నాగేశ్వరరావు హాజరై వాదనల్ని విన్పించారు. ఈ ముగ్గురు పథకం ప్రకారం బస్సుకు నిప్పు పెట్టి, ముగ్గురు విద్యార్థినుల మృతి కారణం కాలేదని, ఆవేశంతో జరిగిన తప్పు మాత్రమేనంటూ వాదనల్ని విన్పించారు.
అలాగే, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితులకు విధించిన ఉరి శిక్ష యావజ్జీవంగా మారి ఉన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. వాదనల అనంతరం ఆవేశ పూరితంగా చేసిన ఘటన కావడంతో ఉరిశిక్షను రద్దు చేస్తున్నట్టు బెంచ్ ప్రకటించింది. ఉరి శిక్షను యావజ్జీవంగా మారుస్తూ తీర్పు వెలువడడంతో కోకిల వాణి, గాయత్రి, హేమలత కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డల మృతికి కారణమైన వాళ్లను ఇప్పటికే ఉరి తీసి ఉండాలని, అప్పుడే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు.