మంత్రి గారి ఆలస్యం ... విద్యార్థినిపై అత్యాచారం
ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ సర్కారు విద్యార్థులకు అందిస్తున్న ఉచిత ల్యాప్టాప్ల పథకం.. ఓ విద్యార్థిని అత్యాచారానికి కారణమైంది. ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సిన మంత్రిగారు ఆలస్యంగా రావడంతో.. ల్యాప్టాప్ అందుకుని తిరిగి వెళ్తున్న ఓ విద్యార్థిని దారుణ అత్యాచారానికి గురైంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్లో చోటు చేసుకుంది. ఫైజాబాద్లో సోమవారం మధ్యాహ్నం విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాల్సిన ఆ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అవధేష్ ప్రసాద్ దాదాపు ఎనిమిది గంటలు ఆలస్యంగా వచ్చారు. దాంతో రాత్రి 10.30కి ల్యాప్టాప్లను విద్యార్థులకు మంత్రి పంపిణీ చేశారు.
ఆ బాలిక ల్యాప్టాప్ తీసుకుని ఆటోలో తోటి విద్యార్థులతో పాటు స్వగ్రామమైన విశ్వంభరపట్ బయలుదేరింది. అందరినీ దించిన ఆటో డ్రైవర్ ఆమెను మాత్రం దించకుండా ఊరి చివర పొలాల్లోకి తీసుకెళ్లాడు. అనంతరం అత్యాచారం జరిపి, పరారయ్యాడు. దాంతో బాలిక తల్లితండ్రులకు జరిగిన విషయాన్ని తెలిపింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు. మంత్రి అవధేష్ ప్రసాద్ అంత ఆలస్యంగా రావడమే ఈ దారుణానికి కారణమని విశ్వంభర్పట్ గ్రామస్థులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.