భూకేంద్రానికి వెళ్లాలంటే 1.8 ఏళ్లు పడుతుంది...
హారిస్‌బర్గ్: భూగోళం కేంద్ర బిందువు వరకు ఓ మనిషి ప్రయాణించాలంటే ఎంతకాలం పడుతుంది? ఆసక్తికరమైన ఈ ప్రశ్నకు అమెరికాలోని పెన్సిల్వేనియా కింగ్స్ కాలేజీకి చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు సమాధానం చెప్పారు. భూమి ఉపరితలం నుంచి భూగర్భంలోని కేంద్ర బిందువు వరకు ఓ సొరంగ మార్గం ఉందనుకుంటే అందులో ఓ విమానం ద్వారా చొచ్చుకొని పోయినట్లయితే 1.8 సంవత్సరాలు పడుతుందని భౌతికశాస్త్రవేత్తలు థామస్ కాంకనన్, గెరార్డో గియోర్డనో అంచనావేశారు.
ఇంత ఎక్కువకాలం పట్టడానికి కారణం ఏమిటంటే లోపలికి వెళుతున్నాకొద్దీ పెరిగే భూమ్యాకర్షణ శక్తితోపాటు టన్నెల్ గోఢల నుంచి ఉత్పన్నమయ్యే ఒత్తిడే కారణమని వారు చెప్పారు. టన్నెల్‌లో గ్యాస్ రూపంలో ఎదరయ్యే ఒత్తిడి పోనుపోను ఘనపదార్థం ఒత్తిడిలా మారుతుందని కూడా వారు చెప్పారు.
భూమి తిరగకుండా నిశ్చల స్థితిలో ఉందనుకుంటే, టన్నెల్లో గాలి ఒత్తిడి, భూమ్యాకర్షణ శక్తి ఏదీ లేదనుకుంటే, ఒట్టి శూన్యం మాత్రమే ఉందనుకుంటే 42 నిమిషాల్లోనే భూ కేంద్రానికి చేరుకోవచ్చని వారు తెలిపారు. ఏ వాహనం ద్వారాగానీ భూ కేంద్రం వద్దకు వెళ్లేందుకు ప్రస్తుతంగానీ, సమీప భవిష్యత్తులోగానీ సాధ్యమయ్యే పనికాదని వారు చెబుతున్నారు.