
సహారా మ్యూచువల్ ఫండ్ లైసెన్సు రద్దు
సహారా గ్రూపునకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా సహారా మ్యూచువల్ ఫండ్ రిజిస్ట్రేషన్ను సెబి రద్దుచేసింది. ఈ వ్యాపారం చేయడానికి ఇక అది ఏమాత్రం పనికిరాదని తేల్చేసి, దాని ఆపరేషన్లను మరో ఫండ్ హౌస్కు బదిలీ చేయాలని ఆదేశించింది. సహారా గ్రూపునకు చెందిన రెండు కంపెనీలు రూ. 24 వేల కోట్లు చెల్లించాలంటూ సెబి ఆదేశించిన తర్వాతి నుంచి సహారా గ్రూపునకు, సెబికి మధ్య చాలా కాలంగా రెగ్యులేటరీ, చట్టపరమైన వివాదాలు నడుస్తున్నాయి.
ఇటీవలే ఓ సహారా కంపెనీకి చెందిన పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ లైసెన్సును కూడా సెబి రద్దు చేసింది. ఇప్పుడు తాజాగా సహారా మ్యూచువల్ ఫండ్ సర్టిఫికెట్ను రద్దు చేసింది. సహారా మ్యూచువల్ ఫండ్, సహారా ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు ప్రస్తుత, కొత్త మదుపుదారుల నుంచి సబ్స్క్రిప్షన్లు తీసుకోవడం వెంటనే ఆపేయాలని కూడా సెబి ఆదేశించింది.