ఐపీఓకు బీమా కంపెనీలు? | SEBI seeks fresh clarification on UFO Moviez's Rs. 750 crore IPO | Sakshi
Sakshi News home page

ఐపీఓకు బీమా కంపెనీలు?

Published Wed, Feb 18 2015 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 9:29 PM

ఐపీఓకు బీమా కంపెనీలు?

ఐపీఓకు బీమా కంపెనీలు?

జనరల్ ఇన్సూరెన్స్ లిస్టింగ్‌కు కేంద్రం యత్నాలు
 అదే బాటలో ప్రైవేటు బీమా కంపెనీలు
 బీమా ఆర్డినెన్స్‌తో ఇన్వెస్టర్లకు పెరిగిన నమ్మకం
 గతేడాది జనరల్ పీఎస్‌యూ కంపెనీల లాభం రూ. 2,899 కోట్లు
 5-10 శాతం విక్రయిస్తామంటున్న ఐసీఐసీఐ, ఎస్‌బీఐ

 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టాక్ మార్కెట్ గడప తొక్కడానికి బీమా కంపెనీలు సిద్ధమవుతున్నాయి. జీవిత బీమాతో పాటు సాధారణ బీమా సేవలందిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు రంగ కంపెనీలు రెండూ స్టాక్ మార్కెట్లో నమోదవటం ద్వారా నిధులు సేకరించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రైవేటు రంగంలోని ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బీమా కంపెనీలు ఈ దిశగా సంకేతాలివ్వగా మరికొన్ని కంపెనీలు తెరవెనుక కార్యక్రమాలు మొదలుపెట్టాయి. ఈ మూడూ అటు జీవిత బీమా, ఇటు సాధారణ బీమా రెండు రంగాల్లోనూ ఉన్నాయి. ఎస్‌బీఐ సొంతంగానే రెండు రంగాల్లోనూ ఉండగా... ఐసీఐసీఐ సంస్థ దక్షిణాఫ్రికాకు చెందిన లాంబార్డ్‌తో కలసి సాధారణ బీమా సేవల్ని, అమెరికాకు చెందిన ప్రుడెన్షియల్‌తో కలసి జీవితబీమా సేవల్ని అందిస్తోంది.
 
  హెచ్‌డీఎఫ్‌సీ కూడా జర్మనీకి చెందిన ఇర్గోతో కలసి సాధారణ బీమా సేవల్ని, అమెరికాకు చెందిన స్టాండర్డ్‌తో కలసి జీవిత  బీమా సేవల్ని అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ సంస్థ ఎంత వాటాను విక్రయించాలనుకుంటున్నదీ చెప్పకపోయినా... ఐసీఐసీఐ మాత్రం 5 శాతం వాటాను విక్రయించే అవకాశముందని తెలియజేసింది. ఎస్‌బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య కూడా 10 శాతం వాటాను విక్రయించాలనుకుంటున్నట్లు ఇటీవల ఫలితాల సందర్భంగా తెలియజేశారు. మరోవంక కేంద్ర ప్రభుత్వం సైతం తన చేతిలో ఉన్న బీమా కంపెనీల్లో కొంత వాటాను పబ్లిక్ ఇష్యూ ద్వారా విక్రయించే అవకాశాల్ని పరిశీలిస్తోంది. అయితే ముందుగా ఎల్‌ఐసీతో కాకుండా సాధారణ బీమా సేవలందిస్తున్న నాలుగు కంపెనీల్లో ఏదో ఒకదాన్లో వాటాలు విక్రయించాలని భావిస్తోంది.
 
  అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే ఆర్థిక ఏడాది ఏదో ఒక సాధారణ బీమా కంపెనీ స్టాక్ మార్కెట్లో నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విషయమై ఇటీవలే కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి హస్‌ముఖ్ అదియా నాలుగు ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలతో సమావేశం నిర్వహించారు. మొదటగా న్యూ ఇండియా, జనరల్ ఇన్సూరెన్స్‌లలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. దేశంలో అతిపెద్ద జీవిత బీమా కంపెనీగా ఉన్న ఎల్‌ఐసీతో మొదలుపెడితే ఉద్యోగులు, ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావచ్చని భావిస్తున్న కేంద్రం... మొదట జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలతో ఆరంభించాలని, వీటిని విజయవంతంగా నమోదు చేస్తే ఎల్‌ఐసీ లిస్టింగ్‌కు మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
 
 గుదిబండగా వాహన బీమా...
 వాహనదార్లందరికీ ఉండే మోటార్ ఇన్సూరెన్స్ విభాగమే కంపెనీలకు గుదిబండగా మారింది. 2013-14లో వాహన బీమాలో రూ.7,549 కోట్ల అండర్‌రైటింగ్ నష్టాలు నమోదయ్యాయి. దీంతో వచ్చే ఏడాది నుంచి వాహన బీమా ప్రీమియంలు పెంచడానికి కూడా కంపెనీలు సిద్ధమవుతున్నాయి. పరిస్థితులు ఇలా ఉన్నప్పటికీ గతేడాది 4 ప్రభుత్వ రంగ బీమా కంపెనీలూ కలసి రూ.2,899 కోట్ల లాభాల్ని ప్రకటించాయి. లాభాల్లో ఉన్న కంపెనీలను నమోదు చేస్తే ఇన్వెస్టర్లను ఆకర్షించవచ్చన్నదని ప్రభుత్వ యోచన. అందుకే బ్యాలెన్స్ షీట్లను మెరుగుపరచుకోవాలని పీఎస్‌యూ యాజమాన్యాలను కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించింది.
 
 బీమా ఆర్డినెన్స్‌తో కదలిక...
 స్టాక్ మార్కెట్లో నమోదవటానికి వీలుగా బీమా కంపెనీలకు రెండేళ్ళ క్రితమే ఐఆర్‌డీఏ మార్గదర్శకాలు జారీ చేసింది. అయినా ఒక్క కంపెనీ కూడా ముందుకు రాలేదు. తాజాగా బీమా చట్ట సవరణ బిల్లును ఆర్డినెన్స్ ద్వారా తేవటంతో ఈ రంగంలో సంస్కరణలకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న విషయం స్పష్టమైంది. ఈ ఆర్డినెన్స్‌కు చట్టబద్ధత వచ్చినవెంటనే ఐపీవోకి వచ్చేలా కంపెనీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. కొన్నేళ్లుగా సగటున 20 శాతం వృద్ధిని సాధిస్తున్న బీమా రంగం ప్రస్తుతం రూ.85,000 కోట్లకు చేరింది. 2015-16లో లక్ష కోట్ల మార్కును దాటుతుందని అంచనా.
 
 అంటే..?
 అండర్‌రైటింగ్ నష్టాలు: కంపెనీలు వసూలు చేసిన ప్రీమియం కంటే క్లెయిమ్‌ల మొత్తం ఎక్కువగా ఉండటం.
 
 ప్రభుత్వ రంగ బీమా కంపెనీలు
 1) యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ
 2) న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ
 3) నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ
 4) ద ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ
 5) లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
 6) అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా
 
 సాధారణ, జీవిత బీమా రెండూ ఉన్న ప్రైవేటు సంస్థలు
 1) భారతీ యాక్సా     2) బజాజ్  అలయెంజ్
 3) ఎల్ అండ్ టీ    4) రిలయన్స్
 5) ఎస్‌బీఐ
 సాధారణ బీమా మాత్రమే అందిస్తున్నవి...
 1) చోళమండలం ఎంఎస్     2) ఫ్యూచర్ జెనరాలీ
 3) హెచ్‌డీఎఫ్‌సీ ఇర్గో     4) ఐసీఐసీఐ లాంబార్డ్
 5) ఇఫ్కో టోకియో     6) లిబర్టీ వీడియోకాన్
 7) మాగ్మా హెచ్‌డీఐ     8) రహేజా క్యూబీఈ
 9) రాయల్ సుందరం    10) శ్రీరామ్
 11) టాటా ఏఐజీ     12) యూనివర్సల్ సంపూ
 జీవిత బీమా మాత్రమే అందిస్తున్నవి...
 1) ఏగాన్ రెలిగేర్    2) అవీవా ఇండియా
 3) కోటక్ మహీంద్రా ఓఎం    4) టాటా ఏఐఏ    5) స్టార్ యూనియన్ దైచీ    5) మ్యాక్స్ లైఫ్
 6) హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్    7) ఐడీబీఐ ఫెడరల్
 8) ఇండియా ఫస్ట్ లైఫ్    9) బిర్లా సన్‌లైఫ్    10) ఐసీఐసీఐ ప్రు..    11) ఎక్సైడ్ లైఫ్
 12) కెనరా హెచ్‌ఎస్‌బీసీ ఓబీసీ లైఫ్
 ఆరోగ్య బీమా కంపెనీలు...
 1) అపోలో మ్యూనిచ్
 2) సిగ్నా టీటీకే
 3) ఐసీఐసీఐ లాంబార్డ్
 4) స్టార్ హెల్త్ అల్లీడ్
 5) రెలిగేర్ హెల్త్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement