సమ్మె విరమణకు ససేమిరా | Secretariat Seemandhra Employees continue for 50 days | Sakshi
Sakshi News home page

సమ్మె విరమణకు ససేమిరా

Published Fri, Sep 20 2013 3:39 AM | Last Updated on Fri, Sep 1 2017 10:51 PM

Secretariat Seemandhra Employees continue for 50 days

సాక్షి; హైదరాబాద్: సమైక్యాంధ్ర కోరుతూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు చేస్తున్న నిరసనలు 50 రోజులు పూర్తిచేసుకున్నాయి. గురువారం 50వ రోజు నిరసనలను ఉద్యోగులు వినూత్న రీతిలో నిర్వహించారు. సమైక్య గణేశుని పూజించి ర్యాలీగా సాగి హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేశారు. ‘గణేశా.. గణేశా.. రాష్ట్రాన్ని రక్షించు..’ అంటూ నినాదాలతో ర్యాలీ తీశారు. సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె కూడా గురువారానికి 17వ రోజుకు చేరుకుంది. మరోవైపు రాష్ట్ర విభజన ప్రకటనకు వ్యతిరేకంగా నిరవధిక సమ్మె చేపడుతున్న సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి గురువారం సచివాలయంలో చర్చలు జరిపారు.

సమ్మె కారణంగా ప్రభుత్వ కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలుగుతోందని, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వీటిని దృష్టిలో ఉంచుకుని వెంటనే సమ్మె విరమించాల్సిందిగా ఉద్యోగులను కోరారు. అయితే సీఎస్ అభ్యర్థనను సచివాలయ ఉద్యోగులు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడే వరకూ సమ్మె కొనసాగిస్తామని ఉద్యోగులు సీఎస్‌కు స్పష్టం చేశారు. సమ్మె కారణంగా విద్యార్థులు నష్టపోతున్నారని, ప్రజా పంపిణీ వ్యవస్థ పనిచేయక పేదలకు నిత్యావసర సరుకులు అందడం లేదని ఉద్యోగులకు సీఎస్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.
 
  ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్‌లకు ఆటంకం కలుగుతోందని, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా సమ్మె విరమించాలని కోరారు. సమస్యలను మంత్రివర్గ ఉపసంఘానికి వివరించి పరిష్కారం పొందవచ్చని సూచించారు. అయితే రాష్ట్ర విభజనతో ఉద్యోగులే కాకుండా సీమాంధ్ర విద్యార్థులు, ప్రజలు తీవ్రంగా నష్టపోతారని, సామాజిక బాధ్యతతో తాము సమ్మె చేపడుతున్నామని ఉద్యోగులు సీఎస్‌తో చెప్పారు. ఇలా ఎన్ని రోజులు సమ్మె కొనసాగిస్తారని సీఎస్ ప్రశ్నించగా రాష్ట్ర విభజన ప్రక్రియ నిలిపి వేశామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించే వరకూ కొనసాగిస్తామని ఉద్యోగులు స్పష్టం చేశారు. సమ్మె రోజులకుగాను తాము జీతం కూడా తీసుకోవడం లేదని, భవిష్యత్తులో ఎన్ని రోజులు సమ్మె కొనసాగినా వేతనాలు కోరబోమన్నారు.
 
 25న ఢిల్లీకి సీమాంధ్ర ఉద్యోగులు..
 సమైక్య ఆందోళనలను దేశ రాజధానికి విస్తరించాలని నిర్ణయించిన సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు అందులో భాగంగా 25న ఢిల్లీ పయనమవుతున్నారు. వరుసగా 3 రోజులపాటు రాజధానిలో వివిధ రూపాల్లో నిరసనలు తెలపాలని నిర్ణయించినట్టు సచి వాలయ సీమాంధ్ర ఫోరం అధ్యక్షుడు మురళీకృష్ణ, కార్యదర్శి కె.వి.కృష్ణయ్య చెప్పారు. గురువారం సచివాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ నిరసనల ప్రణాళికను వెల్లడించారు. ఏపీఎన్జీవోల సమ్మెపై మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం సచివాలయంలో నిర్వహించనున్న సమావేశానికి తమను ఆహ్వానిస్తే వెళ్లి సమస్యలను చెప్పుకుంటామన్నారు. సీమాంధ్ర ఉద్యోగులందరం పెద్ద సంఖ్యలో ఢిల్లీ వెళ్తామని చెప్పారు. 27న జంతర్‌మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించాలని నిర్ణయించామని, ఈ ధర్నాకు బీజేపీ సహా రాష్ట్రంలోని అన్ని పార్టీల అధ్యక్షులు, జాతీయ పార్టీల నేతలను ఆహ్వానిస్తామన్నారు.
 
 చర్చలకు రండి
 మంత్రివర్గ ఉపసంఘం ఆహ్వానం
 సభ ఉన్నందున రాలేమన్న సంఘాలు
 రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె బాట పట్టిన సీమాంధ్ర ఉద్యోగ  సంఘాలను మంత్రివర్గ ఉపసంఘం చర్చలకు ఆహ్వానించింది.  శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో చర్చలు జరుగుతాయని తెలిపింది. అయితే శుక్రవారం విజయవాడలో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ జరుగుతున్నందున చర్చలకు రాలేమని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. ఆదివారం అయితే చర్చలకు వస్తామని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం చర్చలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement