సీమాంధ్ర కాంగ్రెస్ నేతల మల్లగుల్లాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై సీమాంధ్రలో సాగుతున్న ఉద్యమంలోకి ఎలా చొచ్చుకుపోవాలన్న అంశంపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మల్లగుల్లాలు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై వారు ఆలోచనలు సాగిస్తున్నారు. ఇందుకు సంబంధించి సోమవారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలసి కొంతమంది మంత్రులు చర్చలు సాగించారు. మంత్రులు సాకే శైలజానాథ్, గంటా శ్రీనివాసరావు సహా కొంతమంది మంత్రులు సీఎంను క్యాంపు కార్యాలయంలో కలసి దీనిపై చర్చించారు. కాంగ్రెస్ అంటేనే ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నందున కాంగ్రెస్ అనే పేరెత్తకుండా ప్రజల్లోకి వెళ్లే ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నారు. దీనిపై చర్చించి వివిధ కార్యక్రమాలు రూపొందించేందుకు పది మంది మంత్రులు, కొందరు సీనియర్ నేతలతో కమిటీని ఏర్పాటుచేసుకోవాలని భావిస్తున్నారు.
మంత్రులు గంటా శ్రీనివాసరావు, సాకే శైలజానాథ్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, టీజీ వెంకటేశ్ తదితరులతో ఈ కమిటీని ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ‘‘మా కమిటీ సభ్యులంతా త్వరలోనే సమావేశమై ఉద్యమం గురించి లోతుగా చర్చిస్తారు. ఉద్యమంలో మేమంతా ఏ రీతిన భాగస్వాములం కావాలో కార్యాచరణను రూపొందిస్తారు. ఆదిశగా తదుపరి కార్యక్రమాలు చేపడతాం’’ అని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే తమప్రధాన డిమాండ్ అని వివరించారు. రాష్ట్ర సమైక్యత విషయంలో తొలి నుంచీ సీమాంధ్ర కాంగ్రెస్ నేతలే గట్టిగా నినదిస్తున్నారని చెప్పారు. ఒకటిరెండు రోజుల్లోనే ఈ కమిటీ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించే అవకాశముందంటున్నారు. ముఖ్యంగా సీమాంధ్రలో కాంగ్రెస్ నేతలే లక్ష్యంగా ఉద్యమం మరింత తీవ్రమవుతుండడంతో దాన్ని తప్పించుకొనేందుకే ఈ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కాంగ్రెస్ పేరుతో వెళ్లాలా? లేదా వేరే వేదిక ద్వారా ప్రజల్లోకి పోవాలా? అన్నదానిపై చర్చలు సాగిస్తున్నారు.
కాంగ్రెస్ పేరు లేకుండా కొత్త పార్టీ: వీరశివారెడ్డి
కాంగ్రెస్ పేరు వినిపించకుండా కొత్త పార్టీ త్వరలో రూపుదిద్దుకోనుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పేరుతో వెళ్తే ప్రజలు ఛీత్కరిస్తున్నారని, ఏ ఒక్కరూ గెలిచే పరిస్థితే లేదని చెప్పారు. సోమవారం ఆయన సీఎల్పీలో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. అదే సందర్భంలో మంత్రులు శైలజానాథ్, గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి, ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఆమోస్ మరికొందరు నేతల మధ్య ప్రస్తుత పరిస్థితిపై ఇష్టాగోష్టిగా చర్చ సాగింది. సీమాంధ్రలో కాంగ్రెస్, సోనియా పేరు చెబితే ప్రజలు తిరగబడుతున్నారని జేసీ తన అనుభవాలను వివరించారు. మరో నేత మాట్లాడుతూ ఇటీవల ఒక వృద్ధురాలు తన వద్దకు వచ్చి రాష్ట్రాన్ని చీల్చేస్తున్న సోనియాకు ఆ ఉసురుతగలకతప్పదని, ఆమె ఎన్నాళ్లు బతుకుతారని శాపనార్థాలు పెట్టారని పేర్కొన్నారు. దీనిపై పక్కనే ఉన్న ఆమోస్ అందుకొని మీకు చాతకాక సోనియాను ఎందుకు దూషిస్తారని అభ్యంతరం వ్యక్తపరిచారు.
‘‘తెలంగాణ విభజన అయిపోయింది. ఇక ఎన్ని చేసినా ఆగబోదు. మీకేం సమస్యలున్నాయో చెప్పుకోండి. అంతే తప్ప ఉద్యమాలు, ఆందోళనలు అంటూ ముందుకు వెళ్లడం వృథా. దీనివల్ల మీప్రాంతాలకే నష్టం’’ అని పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘మా సమస్యలు చెబుతాం తీరుస్తారా? అవి తీరేవే అయితే ఇంత ఉద్యమం ఎందుకు? ఒకే ఒక్కటి అడుగుతాం. ముందు హైదరాబాద్ గురించి తేల్చండి. ఆ తరువాత తక్కిన అంశాలపై మాట్లాడుకుందాం’’ అని దివాకర్‌రెడ్డి పాల్వాయిని అడిగారు. ‘‘హైదరాబాద్ సంగతి మర్చిపోండి. దానిపై మీకెలాంటి అధికారమూ లేదు. కావాలంటే మూసీని ఇచే ్చస్తాం తీసుకోండి’’ అని పాల్వాయి పేర్కొన్నారు. ‘‘మూసీకి ఒకవైపు ఆంధ్ర, మరోవైపు తెలంగాణ ఉంటే తమకు అంగీకారమే’’నని జేసీ అందుకు సమ్మతించారు. అయితే తాను మూసీలోని మురికిని ఇస్తానని చెబుతున్నానని, అది తీసుకుపోండని పాల్వాయి నవ్వుతూ అన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే వాటిని కేంద్ర మంత్రుల కమిటీకి చె ప్పుకోవచ్చని సూచించారు.
ప్రజల్లోకి ఎలా వెళ్దాం?
Published Tue, Oct 8 2013 4:01 AM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM
Advertisement
Advertisement