
భగ్గుమన్న సీమాంధ్ర
న్యూస్‌లైన్ నెట్‌వర్క్ : తెలంగాణ నోట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై గురువారం సీమాంధ్రలో ఆగ్రహజ్వాలలు పెల్లుబికాయి. సమైక్యాంధ్రులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఉద్యోగులు, విద్యార్థులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 72 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. విద్యా సంస్థలను బంద్ చేస్తున్నట్టు కళాశాలల జేఏసీ ప్రకటించగా.. సీమాంధ్ర జేఏసీ పిలుపు మేరకు ఏపీఎన్‌జీఓలు, ఉద్యోగ జేఏసీ ప్రతినిధులు, విద్యార్థి జేఏసీ, న్యాయవాద జేఏసీలు సంయుక్తంగా 48 గంటల బంద్‌కు పిలుపునిచ్చాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆర్టీసీ, న్యాయవాద, ఉద్యోగ, విద్యార్థి జేఏసీల నేతలు కొవ్వొత్తుల చేతపట్టుకుని మానవహారంగా ఏర్పడ్డారు. అమలాపురంలో మెరుపు బంద్‌కు దిగి దుకాణాలు బంద్ చేయించారు. టీ నోట్‌గా పేర్కొన్న ప్రత్రాలను తగులబెట్టారు. కొత్తపేటలో కాంగ్రెస్‌పార్టీ కార్యాలయం బోర్డులను ధ్వంసం చేశారు. 16వ నెంబరు జాతీయ రహదారిపై ఎరవ్రరం, ప్రత్తిపాడుల వద్ద జాతీయ రహదారులు దిగ్భంధం చేశారు.
మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ శ్రేణులు రాత్రి తొమ్మిది గంటల సమయంలో విశాఖలోని ఆయన ఇంటిని ముట్టడించారు. ఆంధ్ర యూనివర్శిటీ విద్యార్థులు రోడ్డెక్కి కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా నినాదాలు చేశారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నాయకులు ఆందోళన నిర్వహించారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో పొట్టిశ్రీరాములు కూడలి వద్ద టీవీలు పగులకొట్టి, టైర్లు కాల్చి నిరసన తెలిపారు. విజయవాడ బెంజి సర్కిల్‌లో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఏపీ ఎన్జీవోలు కొవ్వొత్తులు వెలిగించి నిరసన ప్రదర్శన నిర్వహించి, క్యాబినెట్ దిష్టిబొమ్మను దహనం చేశారు. జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు అనంతపురంలో భారీ ర్యాలీ నిర్వహించి మానవహారం నిర్మించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే, వైస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉపనేత శోభా నాగిరెడ్డి ఆధ్వర్యంలో రాత్రి 10గంటల సమయంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఎమ్మిగనూరులో కాంగ్రెస్, టీడీపీ దీక్షా శిబిరాలను ధ్వంసం చేశారు.
డోన్‌లో రైల్యే పట్టాలపై టైర్లకు నిప్పుపెట్టారు. వెల్దుర్తి వద్ద సమైక్యవాదులు జాతీయరహదారిపై ధర్నా చేపట్టడంతో రాకపోకలు స్తంభించాయి. కర్నూలు కలెక్టరేట్ కూడలిలో ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి నాయకులు రాస్తారోకో నిర్వహించి టైర్లకు నిప్పంటించారు. గుంటూరు జిల్లా తెనాలిలోని సమైక్యవాదులు, ఎన్‌జీవో సంఘ నాయకులు గాంధీచౌక్‌లో కేంద్ర మంత్రుల ఫ్లెక్సీలను దహనం చేశారు. బోసురోడ్డు, టెలిఫోన్ ఎక్సే్ఛంజ్, మారీసుపేట, చెంచుపేటల్లోని బార్ అండ్ రెస్టారెంట్లపై దాడులు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి, కొత్తపేటల్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపై గురువారం రాత్రి సమైక్యవాదులు దాడి చేశారు. రాజమండ్రి కార్యాలయంలో ఇన్వర్టర్‌పై కిరోసిన్ పోసి నిప్పంటించడానికి ప్రయత్నించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి కోర్టు జంక్షన్‌లో గురువారం సాయంత్రం ఆరు నుంచి రాత్రి పది గంటల వరకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఆర్వీ సుజయకృష్ణ రంగారావు ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు రాస్తారోకో చేశారు. రోడ్డుకు అడ్డంగా టైర్లు కాల్చి నిరసన తెలిపారు.
తిరుపతిలో సెల్ టవర్, పోస్టాఫీసులకు నిప్పు
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి ఎదురుగా రైల్వే ట్రాక్ వద్దనున్న సెల్ టవర్ జనరేటర్‌ను గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. ఎస్వీ యూనివర్శిటీలోని పోస్టాఫీసుకు నిప్పుపెట్టారు. పోస్టాఫీసు లోపల పడుకొని వున్న సిబ్బంది అప్రమత్తమై వంటలు అర్పారు. ఎన్జీవోలు తిరుపతి-తిరుమల బైపాస్ రోడ్డును దిగ్బంధించారు. లీలా మహల్ సర్కిల్‌లో మంటలు వేసి వాహనాలను రాకపోకలను అడ్డుకున్నారు.
టీ నోట్ ఆమోదం మనస్తాపంతో నలుగురు మృతి
తెలంగాణ నోట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో మనస్తాపం చెంది నలుగురు సమైక్యవాదులు గుండె ఆగిపోయి మృతిచెందారు. చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన ఎంఎంపీ గౌస్(77), విజయనగరం జిల్లా పార్వతీపురంలోని అగ్రహారం వీధికి చెందిన తిరుమరెడ్డి ఈశ్వర్రావు(47), తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లికి చెందిన రాయవరపు నరసింహారావు (85), వాడపర్రుకు చెందిన తొరం బులి సత్యనారాయణ(65) మరణించారు.
తిరుమలకు వాహనాల రాకపోకలు నిలిపివేత
తెలంగాణ నోట్‌ను క్యాబినెట్ ఆమోదించడంతో తిరుపతి ఏపీ ఎన్‌జీవోలు, ఆర్‌టీసీ జేఏసీ నాయకులు శుక్రవారం తిరుపతి బంద్‌కు పిలుపునిచ్చారు. తిరుమలకు వెళ్లే వాహనాలకు కూడా మినహాయింపు లేదన్నారు. తిరుపతిని పూర్తిగా దిగ్బంధం చేస్తామని, ఏ వాహనాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానుండగా శుక్రవారం బంద్‌కు పిలుపునివ్వడంతో టీటీడీ అధికారులు ఆందోళన చెందుతున్నారు. విభజన ప్రక్రియ ప్రారంభించిన తర్వాత తిరుమలకు వాహనాలను నిలిపివేయడం ఇది మూడోసారి. ఎస్‌వీయూ విద్యార్థి జేఏసీ నాయకులు సీమాంధ్ర బంద్‌కు పిలుపునిచ్చారు. విద్యాసంస్థలు కూడా బంద్‌లో పాల్గొంటాయని తె లిపారు. టీనోట్‌పై గురువారం అనంతపురం జిల్లాలో నిరసనలు మిన్నంటాయి. టీ నోట్ విషయం తెలియగానే ఎస్కేయూలో విద్యార్థులు రగిలి పోయారు. 205 జాతీయ రహదారిపై యూపీఏ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి.. రెండు గంటల పాటు వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు.