రాష్ట్ర విభజన నేపథ్యంలో వెల్లువెత్తిన ఆందోళనల సెగల్ని చల్లార్చడానికి కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది.
సానుకూలంగా ఉన్న కేంద్రం!
త్వరలోనే హోంశాఖకు సమ్మతి తెలియజేయనున్న హెచ్‌ఆర్‌డీ
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో వెల్లువెత్తిన ఆందోళనల సెగల్ని చల్లార్చడానికి కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. ఎన్‌ఐటీ, ఐఐఎం, ఐఐటీ లాంటి కేంద్ర విద్యా సంస్థల్ని సీమాంధ్ర ప్రాంతానికి కేటాయించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కేంద్ర విద్యాలయాల ఏర్పాటు విషయంలో జీవోఎంకు వచ్చిన ప్రతిపాదనలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. కేంద్ర మానవ వనరుల శాఖకు పంపింది. వాటిపై సానుకూల నిర్ణయం తీసుకోవడానికి హెచ్‌ఆర్‌డీ సిద్ధంగా ఉందని, తమ సమ్మతిని కూడా త్వరలోనే హోం మంత్రిత్వ శాఖకు తెలపనుందని సమాచారం.
కాగా, విశాఖపట్నంలో ఐఐటీ, ఆంధ్రా యూనివర్సిటీని సెంట్రల్ యూనివర్సిటీగా మార్పు, విజయవాడలో ఐఐఎం ఏర్పాటు చేయాలని జీవోఎంకు వచ్చిన ప్రతిపాదనల్లో ఎక్కువ మంది కోరారని సమాచారం. వీటి ఏర్పాటు విషయం బిల్లులో కూడా చేర్చాలని వారు డిమాండ్ చేశారు. వెంటనే వాటిని ఏర్పాటు చేసి సంవత్సరంలోపు అవి పని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కూడా జీవోఎంకు విన్నవించారు. విభజన వల్ల సీమాంధ్రలో ఒక్క కేంద్ర విద్యాసంస్థ లేకుండా పోతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు, రాజకీయ పార్టీలు జీవోఎంకు సూచనలు పంపడానికి ఈ నెల 5వ తేదీని తుది గడువుగా నిర్ణయించిన విషయం తెలిసిందే. వచ్చిన సూచనలను క్రోడీకరించి రూపొందించే నివేదికను పార్లమెంటు శీతాకాల సమావేశాల ముందు కేంద్ర కేబినెట్‌కు జీవోఎం సమర్పించనుంది.