సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత ఉద్యోగుల ఆందోళనలతో శనివారం సచివాలయం దద్దరిల్లింది. రాష్ట్ర విభజనకు యూపీఏ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తూ సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు డీ బ్లాక్ భవనంపైకి ఎక్కి ఆందోళనకు దిగగా.. వారి తీరును ఇక తాము సహించబోమంటూ తెలంగాణ ఉద్యోగులు హెచ్చరిస్తూ ధర్నాకు దిగారు. దీంతో సచివాలయంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. యూపీఏ ప్రభుత్వం గుడ్డిగా రాష్ట్ర విభజనకు సిద్ధమైందని ఆరోపిస్తూ దాదాపు 200 మంది సీమాంధ్ర ఉద్యోగులు ముఖ్యమంత్రి కార్యాలయం సమీపంలోని డీ బ్లాక్ భవనంపైకి ఎక్కి ఆందోళనకు దిగారు. నల్లవస్త్రాలు ధరించి, చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని పెద్దపెట్టున నినాదాలు చేశారు. సచివాలయం లోపల ఆందోళనకు అనుమతి ఉన్నా మైకులు వాడకూడదనే నిబంధన ఉంది. కానీ సీమాంధ్ర ఉద్యోగులు మైకులు వాడటంతో తెలంగాణ ఉద్యోగ సంఘం ప్రతినిధులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సీమాంధ్ర ఉద్యోగులు భవనంపైకి ఎక్కుతున్న సమయంలో సచివాలయ భద్రతాధికారుల్లో ఒకరు వారి వెంట ఉండటం ఉద్రిక్తతకు కారణమైంది.
దాదాపు రెండు గంటల పాటు మైకులు వాడుతూ భవనంపై నిరసన తెలిపినా పోలీసులు పట్టించుకోలేదని, సీమాంధ్ర ఉద్యోగులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ ఉద్యోగ సంఘం అధ్యక్షులు నరేందర్‌రావుతోపాటు, సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎ.పద్మాచారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)కి ఫిర్యాదు చేశారు. దీనిపై సంబంధిత అధికారులతో విచారణ జరిపించి చర్యలు తీసుకుంటానని ఆయన వారికి హామీ ఇచ్చారు. అనంతరం ఉద్యోగులు ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా నరేందర్‌రావు, పద్మాచారి మాట్లాడుతూ.. సీమాంధ్ర ఉద్యోగులను సోదరులుగా భావించినందునే ఇన్ని రోజులు వారి విషయంలో ఓపిక పట్టామని, సచివాలయంలో పనులకు విఘాతం కలిగేలా వారు చేస్తున్న చర్యలను ఇక సహించబోమన్నారు. ప్రభుత్వ మద్దతుతోనే వారు నిబంధనలు అతిక్రమించి సచివాలయం స్థాయిని గ్రామ సచివాలయం స్థాయికి తెచ్చారని ఆరోపించారు. దీన్ని అడ్డుకునేందుకు సోమవారం కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. తామే ప్రత్యక్ష చర్యలకు దిగుతామని, తమలపాకుతో అంటే తలుపు చెక్కతో సమాధానమిస్తామని హెచ్చరించారు.
ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా నిర్ణయం..
సీమాంధ్ర ప్రజల మనోభావాలతో సంబంధం లేకుండా రాష్ట్ర విభజనకు సిద్ధమయ్యారని, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారని సీమాంధ్ర ఉద్యోగుల సంఘం కార్యదర్శి కృష్ణయ్య అన్నారు. యూపీఏ తీరును ఎండగడతామని, ఇప్పటి వరకు సత్యాగ్రహం చేస్తున్న తాము ఇకపై సహాయనిరాకరణకు దిగుతామని ప్రకటించారు. సీమాంధ్ర ప్రజలెవరూ ప్రభుత్వానికి పన్నులు కట్టొద్దని విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు రేపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమ్మె చేస్తున్న ఉద్యోగ సంఘాలతో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం సోమవారం చర్చలు జరపనుంది. ఈమేరకు ఆహ్వానం పంపింది. చర్చలకు వెళ్లాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించుకున్నాయి. ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో భేటీ జరగనుంది. సమ్మె విరమింపజేసేందుకు ఉపసంఘం ఉద్యోగ సంఘాలతో మూడుసార్లు చర్చలు జరపడం, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని కేంద్రం హామీ ఇచ్చేవరకు సమ్మె కొనసాగిస్తామని ఆ సంఘాలు చెప్పడం తెలిసిందే. ఇకపై ఉపసంఘం స్థాయి చర్చల్లో పాల్గొనబోమని, ముఖ్యమంత్రి స్థాయిలో చర్చలు జరపాలని ప్రకటించడమూ విదితమే. తెలంగాణ ఏర్పాటు నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ చర్చలకు పిలిచింది.
దద్దరిల్లిన సచివాలయం
Published Sun, Oct 6 2013 3:39 AM | Last Updated on Fri, Sep 1 2017 11:22 PM
Advertisement
Advertisement