వెలుగులో మిడ్‌క్యాప్ షేర్లు
లార్జ్‌క్యాప్ షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో మంగళవారం స్టాక్ సూచీలు స్వల్పనష్టాలతో ముగిసాయి. అమెరికా జాబ్స్ డేటా విడుదలకానున్న నేపథ్యంలో రోజంతా పరిమితశ్రేణిలో సూచీలు హెచ్చుతగ్గులకు లోనయ్యూరు. 139 పాయింట్ల శ్రేణిలో తిరిగిన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు 29 పాయింట్ల నష్టంతో 20,865 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 2 పాయింట్ల నష్టంతో 6,203 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఆయిల్, ఆటోమొబైల్ షేర్లు క్షీణించాయి. పవర్, క్యాపిటల్ గూడ్స్ షేర్లు పెరిగారు. లార్జ్‌క్యాప్ షేర్లు స్వల్పహెచ్చుతగ్గులతో ముగిసినా, మిడ్‌క్యాప్ షేర్లు మాత్రం జోరుగా ర్యాలీ సాగించారు. షాలిమార్ పెయింట్స్, వెల్‌స్పన్ కార్పొరేషన్, రెడింగ్‌టన్, సింటెక్స్, రేణుకా షుగర్స్ షేర్లు 10-20 శాతం మధ్య ఎగిసాయి. పంజ్‌లాయడ్, డాబర్, యస్ బ్యాంక్‌లు 4-7 శాతం మధ్య పెరిగారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 794 కోట్ల నికర పెట్టుబడులు చేయగా, దేశీయ సంస్థలు రూ. 845 కోట్లు వెనక్కు తీసుకున్నారు.
పవర్ కౌంటర్లలో యాక్టివిటీ
ఈ ఏడాది జనవరి-ఆగస్టు మధ్యకాలంలో భారీగా క్షీణించిన షేర్లు గత రెండు నెలల నుంచి కోలుకుంటున్నారు. బ్యాంకింగ్, ఇన్‌ఫ్రా, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్ రంగాలకు చెందిన పలు షేర్లు ఇప్పటివరకూ ర్యాలీ జరపగా, మంగళవారం పవర్ కౌంటర్లలో చురుగ్గా ట్రేడింగ్ జరిగింది. ఈ క్రమంలో టాటా పవర్, రిలయన్స్ పవర్, జేపీ పవర్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, పవర్ ట్రేడింగ్, పవర్‌గ్రిడ్, ఎన్‌హెచ్‌పీసీ షేర్లు తాజాగా 2-6 శాతం మధ్య పెరిగారు. ఈ షేర్ల ఫ్యూచర్ కాంట్రాక్టులు కొన్నింటిలో షార్ట్ కవరింగ్, మరికొన్నింటిలో లాంగ్ బిల్డప్ జరిగినట్లు డెరివేటివ్ డేటా వెల్లడిస్తోంది. లాంగ్ బిల్డప్‌ను సూచిస్తూ రిలయన్స్ పవర్ ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో 9.84 లక్షల షేర్లు (2.76 శాతం) యాడ్‌కాగా, మొత్తం ఓఐ 3.65 కోట్లకు చేరింది. ఈ షేరు రూ. 75 స్ట్రయిక్ వద్ద కాల్‌కవరింగ్, పుట్‌రైటింగ్ జరిగాయి. ఈ కాల్ ఆప్షన్ నుంచి 13.32 లక్షల షేర్లు కట్‌కాగా, పుట్ ఆప్షన్లో 2.76 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. ఈ ఆప్షన్ల వద్ద వరుసగా 26.68 లక్షలు, 20,88 లక్షల షేర్ల చొప్పున బిల్డప్ వుంది. ఈ షేరు రూ. 75పైన స్థిరపడితే రూ. 80 వరకూ పెరగవచ్చని డేటా సూచిస్తోంది. టాటా పవర్, పవర్ ట్రేడింగ్ ఫ్యూచర్ కాంట్రాక్టుల్లో స్వల్పంగా షేర్లు యూడ్ అయ్యాయి. ఎన్‌హెచ్‌పీసీ కౌంటర్లో షార్ట్ కవరింగ్‌ను సూచిస్తూ ఆ కాంట్రాక్టు నుంచి 52 లక్షల షేర్లు (14 శాతం) కట్ అయ్యాయి. ఓఐ 3.18 కోట్ల షేర్లకు తగ్గింది. అయితే రూ. 20 కాల్ ఆప్షన్ వద్ద ఇంకా 60 లక్షల షేర్ల ఓఐ వున్నందున, ఈ షేరు పెరగాలంటే రూ. 20 స్థాయిపైన స్థిరపడాల్సివుంటుంది.
విప్రో రూ. 520 కాల్ ఆప్షన్లో పెరిగిన బిల్డప్...
ఐటీ దిగ్గజ కంపెనీ విప్రో డెరివేటివ్ కాంట్రాక్టుల్లో వరుసగా రెండోరోజు బిల్డప్ కొనసాగింది. ఈ ఫ్యూచర్ ఓఐలో మంగళవారం మరో1.98 లక్షల షేర్లు (2 శాతం) యాడ్‌కావడంతో మొత్తం ఓఐ 1.08 కోట్ల షేర్లకు పెరిగింది. అలాగే రూ. 520 స్ట్రయిక్ వద్ద మరింత కాల్ రైటింగ్ జరగడంతో తాజాగా 5.35 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. ఈ ఆప్షన్లో మొత్తం ఓఐ 13.19 లక్షల షేర్లకు చేరింది. మంగళవారం మార్కెట్ ముగిసిన తర్వాత ఈ కంపెనీ ఆర్థిక ఫలితాల్ని ప్రకటించింది. కంపెనీ ఫలితాలు బావుంటాయనే అంచనాలు మార్కెట్లో వున్నప్పటికీ, ట్రేడర్లు ఈ షేరు రూ. 520 స్థాయిని దాటకపోవచ్చని భావిస్తున్నట్లు ఆప్షన్ రైటింగ్ డేటా సూచిస్తోంది.