చివరి గంటలో భారీ అమ్మకాలు
బుధవారం ట్రేడింగ్ ముగింపు సమయంలో హఠాత్తుగా అమ్మకాలు వెల్లువెత్తడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 256 పాయింట్లు పతనమయ్యింది. అంతర్జాతీయ మార్కెట్లు తిరిగి అనిశ్చితిలో పడటంతో పాటు రూపాయి మారకపు విలువ క్షీణించడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఇండెక్స్ హెవీవెయిట్ షేర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, ఐటీసీలతో పాటు ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్‌లు 1-3 శాతం మధ్య తగ్గడంతో సెన్సెక్స్ 20,635 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇంతగా క్షీణించడం రెండు వారాల తర్వాత ఇదే ప్రధమం. అయితే గత మూడు సెషన్లలో ఇండెక్స్ 696 పాయింట్లు లాభపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచి ట్రేడింగ్ తొలిదశలో 6,200 పాయింట్ల స్థాయి అధిగమించినా, ట్రేడింగ్ చివరిగంటలో నాటకీయంగా 6,109 పాయింట్ల స్థాయికి పడిపోయింది.
చివరకు 80 పాయింట్ల నష్టంతో 6,123 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ప్రపంచ ఆర్థికాభివృద్ధి అంచనాల్ని 3.6 శాతం నుంచి 2.7 శాతానికి అంతర్జాతీయ ఆర్థిక సహకార సంస్థ ఓఈసీడీ తగ్గించడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు బలహీనపడ్డాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. సరళ ద్రవ్య విధానాన్ని కొనసాగించనున్నట్లు అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ బెన్ బెర్నాంకీ గత రాత్రి ప్రకటించినా, అక్కడి మార్కెట్లు కూడా మంగళవారం క్షీణతతో ముగిసాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐలు) పెట్టుబడులు కేవలం రూ. 80 కోట్లకే పరిమితమయ్యాయి. దీపావళి రోజునాటి మూరత్ ట్రేడింగ్ మినహాయిస్తే ఎఫ్‌ఐఐలు ఇంత తక్కువ మొత్తం పెట్టుబడిచేయడం గత రెండు నెలల్లో ఇదే ప్రధమం. దేశీయ సంస్థలు రూ. 283 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి.
నిఫ్టీ ఫ్యూచర్‌లో లాంగ్ అన్‌వైండింగ్...
లాభాల స్వీకరణను సూచిస్తూ నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టులో పెద్ద ఎత్తున లాంగ్ ఆన్‌వైండింగ్ జరిగింది. సమీప భవిష్యత్తులో ఇండెక్స్ మరింత పెరిగకపోవొచ్చన్న అంచనాలు, నవంబర్ డెరివేటివ్ సిరీస్ మరో 6 రోజుల్లో ముగియనుండటంతో ఇన్వెస్టర్లు వారి లాంగ్ పొజిషన్లను ఆఫ్‌లోడ్ చేసుకున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. నిఫ్టీ ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) నుంచి 11.49 లక్షల షేర్లు (6.48 శాతం) కట్‌కావడంతో మొత్తం ఓఐ 1.66 కోట్ల షేర్లకు తగ్గింది. ఈ సిరీస్ ప్రారంభమయ్యే రోజున 2.30 కోట్ల షేర్ల వరకూ వున్న ఓఐ క్రమేపీ తగ్గుతూ వచ్చింది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకూ జరిగిన ట్రేడింగ్ సెషన్లలో ఒకటి, రెండు మినహా మిగతా రోజుల్లో లాంగ్ ఆఫ్‌లోడింగ్ ప్రక్రియే కొనసాగింది. 6,100, 6,200 స్ట్రయిక్స్ వద్ద కాల్ రైటింగ్ జరగడంతో ఈ కాల్ ఆప్షన్లలో ఓఐ 34,39 లక్షలు, 46,55 లక్షల షేర్లకు చేరింది. కాల్ రైటింగ్ కంటే పుట్ కవరింగ్ భారీగా జరిగింది. దాంతో 6,200 పుట్ ఆప్షన్ ఓఐ నుంచి ఒక్కసారిగా 21.02 లక్షల షేర్లు కట్‌కావడంతో మొత్తం ఓఐ 32.38 లక్షల షేర్లకు దిగింది. క్రితం రోజు నిఫ్టీ 6,200 స్థాయిపైన ముగియడంతో మరింత పెరుగుతుందన్న అంచనాలు ఏర్పడి ఇదే స్ట్రయిక్ వద్ద భారీస్థాయిలో పుట్స్ యాడ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా 6,100 పుట్ ఆప్షన్ ఓఐ నుంచి 5.63 లక్షల షేర్లుకట్‌కాగా, మొత్తం ఓఐ 41.05 లక్షల షేర్లకు తగ్గింది. మరింత పెరగవచ్చన్న అంచనాతో కొనుగోలు చేసే షేరు లేదా ఇండెక్స్ ఫ్యూచర్ కాంట్రాక్టును లాంగ్ పొజిషన్ అని, ఆ పొజిషన్‌ను విక్రయించే ప్రక్రియను లాంగ్ అన్‌వైండింగ్ అని వ్యవహరిస్తారు.