మెటల్, సిమెంట్ షేర్ల ర్యాలీ
మెటల్, సిమెంటు షేర్లు ర్యాలీ జరపడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ వరుసగా నాలుగోరోజు లాభపడింది. శుక్రవారం పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన సెన్సెక్స్ చివరకు 66 పాయింట్లు ఎగిసి 20,376 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో 6,063 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అమెరికాలో విడుదలకానున్న జాబ్స్ డేటా మెరుగ్గా వుంటుందన్న అంచనాలతో ప్రపంచ మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడ్‌కావడం ఇక్కడి సెంటిమెంట్‌ను బలపర్చిందని ట్రేడర్లు చెప్పారు.
అయితే భారత్ జీడీపీ వృద్ధి అంచనాలు వెలువడనున్న నేపథ్యంలో కొంతమంది ఇన్వెస్టర్లు ముందు జాగ్రత్తగా లాభాలు స్వీకరించారని, దాంతో రోజంతా సూచీలు ఒడుదుడుకులకు లోనయ్యాయని ట్రేడర్లు వివరించారు. మెటల్ షేర్లు టాటా స్టీల్ 6.5 శాతం, సేసా స్టెరిలైట్ 3.5 శాతం చొప్పున ర్యాలీ జరిపాయి. సిమెంటు షేర్లు అంబూజా, ఏసీసీ, అల్ట్రాటెక్‌లు 2.5-5 శాతం మధ్య పెరిగాయి. ఫైనాన్షియల్ షేర్లు ఐడీఎఫ్‌సీ, బీఓబీ, యాక్సిస్ బాంక్‌లు 2-4 శాతం మధ్య ఎగిసాయి. ఐటీ షేర్లు టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్‌లు 1-1.5 శాతం మధ్య. ఎఫ్‌ఎంసీజీ షేర్లు హెచ్‌యుఎల్, ఐటీసీలు 0.5-1.5 శాతం మధ్య తగ్గాయి.
నిఫ్టీ ఫ్యూచర్స్‌లో షార్ట్ కవరింగ్....
అమెరికా జాబ్స్ డేటా, భారత్ జీడీపీ వృద్ధి అంచనాలు వెలువడనున్న నేపథ్యంలో నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టులో షార్ట్ కవరింగ్ జరిగింది. శుక్రవారం ట్రేడింగ్ సందర్భంగా ఒకదశలో నిఫ్టీ షేర్ల బాస్కెట్ సెల్లింగ్ జరగడంతో సూచీ హఠాత్తుగా క్షీణించింది. ఆ సమయంలో షార్ట్ కవరింగ్ ప్రారంభంకావడంతో నిఫ్టీ చివరకు పాజిటివ్‌గా ముగిసింది. కవరింగ్‌ను సూచిస్తూ ఫ్యూచర్ కాంట్రాక్టు నుంచి 6.54 లక్షల షేర్లు కట్ అయ్యాయి.
మొత్తం ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) 1.53 కోట్ల షేర్లకు తగ్గింది. కొద్దిరోజుల నుంచి మద్దతును అందిస్తున్న 6,000 స్థాయి వద్ద తాజా పుట్ రైటింగ్ ఫలితంగా 7.78 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. మొత్తం ఓఐ 83.30 లక్షల షేర్లకు చేరింది. 6,100 స్ట్రయిక్ కాల్ ఆప్షన్లో 6 లక్షల షేర్లు యాడ్‌కాగా, మొత్తం ఓఐ 48.23 లక్షల షేర్లకు పెరిగింది. సమీప భవిష్యత్తులో క్షీణత సంభవిస్తే 6,000 స్థాయి వద్ద గట్టి మద్దతు లభించవచ్చని, ఈ మద్దతు సాయంతో నెమ్మదిగా 6,100 స్థాయిని నిఫ్టీ దాటవచ్చని ఈ ఆప్షన్ డేటా సూచిస్తున్నది.