27,000పైకి సెన్సెక్స్
ముడి చమురు ధరల రికవరీ ప్రభావం
వరుసగా ఆరో రోజూ లాభాలే
103 పాయింట్ల లాభంతో 27,036కు సెన్సెక్స్
24 పాయింట్లు లాభపడి 8,177కు నిఫ్టీ
మైనింగ్, ఇంధన షేర్ల జోరుతో బుధవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఆర్‌బీఐ రేట్ల కోతతో మొదలైన స్టాక్ మార్కెట్ లాభాల పరుగు వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్‌లోనూ కొనసాగింది. రూపాయి రెండు నెలల గరిష్టానికి బలపడడం, ముడిచమురు ధరలు రికవరీ అవుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లు లాభపడడం కూడా ప్రభావం చూపాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 27వేల మార్క్‌ను దాటింది. సెన్సెక్స్ 103 పాయింట్ల లాభంతో 27,036 పాయింట్ల వద్ద, నిఫ్టీ 25 పాయింట్ల లాభంతో 8,177 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇటీవల బాగా పతనమైన లోహ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. దిగువ స్థాయిలో షార్ట్‌కవరింగ్ జరగడం, అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు పుంజుకుంటుండడం వంటి కారణాల వల్ల లోహ షేర్లు లాభపడ్డాయి.
వచ్చే ఏడాది చమురు సరఫరాలను మరింత కట్టుదిట్టం చేయాలని అమెరికా యోచిస్తోందన్న వార్తలు, భవిష్యత్తు ఉత్పత్తిపై చర్చలు జరపడానికి సౌదీ అరేబియా రష్యాలు సుముఖంగా ఉన్నాయన్న వార్తల కారణంగా ముడిచమురు ధరలు ఎగిశాయి. బ్యారెల్ ముడి చమురు ధర 50 డాలర్లకు పెరగడంతో ఇంధన షేర్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 26,967 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. తర్వాత బ్లూ చిప్ షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో నష్టాల్లోకి జారిపోయింది. ఇంట్రా డేలో 26,878 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ముగింపులో కొనుగోళ్లు పుంజుకోవడంతో 27,083 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 103 పాయింట్ల లాభంతో 27,036 పాయింట్ల వద్ద ముగిసింది. ఆరు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,419 పాయింట్లు లాభపడింది.
విప్రో 2 శాతం డౌన్: లింగ వివక్ష, అసమాన వేతనాలతోపాటు అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారని లండన్‌లో ఒక భారత మహిళా ఉద్యోగి విప్రో కంపెనీకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడంతో ఈ కంపెనీ షేర్ బీఎస్‌ఈలో 1.8 శాతం క్షీణించి రూ.589 వద్ద ముగిసింది.