కాశ్మీర్లో ఐఎస్ఐఎస్ జెండాలు
జమ్ము కాశ్మీర్లో హురియత్ మద్దతుదారులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్లోని ఓ మసీదు వద్ద ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ జెండాలను ఎగరేశారు. అలాగే జమ్ములోని కుప్వారా జిల్లాతో పాటు కాశ్మీర్లో కూడా పాకిస్థానీ జెండాలు మళ్లీ కనిపించాయి. హురియత్ నాయకుడు మీర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ మద్దతుదారులు ఇస్లామిక్ స్టేట్ జెండాలను జమామసీదు సమీపంలో ఎగరేశారు. ఇంతకుముందు పలు సందర్భాల్లో పాకిస్థానీ, లష్కరే తాయిబా జెండాలు కూడా కాశ్మీర్ లోయలో కనిపించినా.. ఇస్లామిక్ స్టేట్ జెండాలు కనిపించడం మాత్రం ఇదే మొదటిసారి.
దీంతో జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలోకి ఇస్లామిక్ స్టేట్ క్రమంగా చాపకింద నీరులా చొచ్చుకొస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంటు మీద దాడికేసు దోషి అఫ్జల్ గురు అస్థికలను అతడి స్వగ్రామానికి రప్పించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. కాశ్మీర్ లోయలో ఇలాంటి సంఘటనలు వద్దంటూ కేంద్రం గతంలో హెచ్చరించినా.. వేర్పాటువాదులు మాత్రం తరచు పాకిస్థాన్ జెండాలను ఎగరేస్తూనే ఉన్నారు.