
బకాయిలు చెల్లించకుంటే అరెస్ట్
న్యూఢిల్లీ: సర్వీస్ ట్యాక్స్ ఎగవేతదారులపై కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. పన్ను బకాయిలను మంగళవారం(31)లోగా చెల్లించాల్సిందిగా ఆదేశించింది. లేదంటే అరెస్ట్ చేయడం వంటి చట్టపరమైన చర్యలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించింది. 2014 జనవరి 1 నుంచి సర్వీస్ ట్యాక్స్ ఎగవేతదారులపై కఠిన చర్యలను తీసుకోనున్నట్లు రెవెన్యూ కార్యదర్శి సుమిత్ బోస్ చెప్పారు. ఈ ఏడాది మే 10 నుంచి అమల్లోకి వచ్చిన వీసీఈ పథకం కారణంగా సర్వీస్ పన్ను బకాయిదారులు ఎలాంటి జరిమానాలు లేకుండా బకాయిలను చెల్లించేందుకు వీలు కలిగింది.
దీనిలో భాగంగా ఈ నెల 29కల్లా రూ. 5,500 కోట్లమేర బకాయిలకు సంబంధించి సుమారు 40,000 దరఖాస్తులు అందినట్లు వెల్లడించారు. గత నాలుగు రోజుల్లోనే రూ. 1,500 కోట్లమేర సర్వీస్ ట్యాక్స్ చెల్లింపులకు 16,000 దరఖాస్తులు లభించినట్లు వివరించారు. మంగళవారంతో వీసీఈ పథకం గడువు ముగియనున్నందున తమ కార్యాలయాలు అర్థరాత్రి వరకూ పనిచేయనున్నట్లు బోస్ పేర్కొన్నారు. ఈ ప్రత్యేక పథకాన్ని వినియోగించుకోవలసిందిగా ఇప్పటికే ఆర్థిక మంత్రి పి.చిదంబరం సర్వీస్ ట్యాక్స్ ఎగవేతదారులకు సూచించారు. ఇలాంటి అవకాశం మళ్లీ 20ఏళ్లకుగానీ లభించదని వివరించారు కూడా. ఈ పథకం కి ంద సర్వీస్ ట్యాక్స్ చెల్లింపుల్లో విఫలమైనవారు 2007 అక్టోబర్ 1 నుంచి 2012 డిసెంబర్ 31 వరకూ సెస్ చార్జీలతోసహా బకాయిల చెల్లింపు వివరాలను ప్రభుత్వానికి అందించేందుకు వీలుంటుంది. తద్వారా జరిమానా చెల్లింపు, చట్టబద్ధ చర్యలనుంచి తప్పించుకునేందుకు అవకాశముంది. సర్వీస్ ట్యాక్స్‌కింద 17 లక్షల మంది రిజిస్టరైనప్పటికీ 7 లక్షల మంది మాత్రమే రిటర్న్‌లను దాఖలు చేశారు.