న్యూఢిల్లీ: ఎన్నికల ముందు నిర్వహించే ఒపీనియన్ పోల్స్‌ను నిషేధించాలని లేకుంటే వాటిని నియంత్రించాలని కాంగ్రెస్ చేసిన డిమాండ్‌తో సోమవారం పలు పార్టీలు శ్రుతి కలిపాయి. అయితే, బీజేపీ మాత్రం ఈ డిమాండ్‌ను వ్యతిరేకించింది. ఓడిపోయే వారే ఒపీనియన్ పోల్స్ వద్దంటారంటూ పరోక్షంగా కాంగ్రెస్‌ను ఎద్దేవా చేసింది. ఒపీనియన్ పోల్స్‌కు విశ్వసనీయత లేదని, ఎన్నికల సమయంలో వాటి ప్రచురణ, ప్రసారాలను నిలిపివేయాలని లేకుంటే వాటిని నియంత్రించాలని కాంగ్రెస్ ఎన్నికల కమిషన్(ఈసీ)ను డిమాండ్ చేయడం తెలిసిందే. ఒపీనియన్ పోల్స్‌పై నిషేధం విధించాలన్న ప్రతిపాదనపై ఈసీ వివిధ పార్టీల అభిప్రాయాలను కోరింది.
ఈ అంశంపై అభిప్రాయాలు తెలిపేందుకు పార్టీలకు ఈసీ ఇచ్చిన గడువు సోమవారంతో ముగిసింది. బీజేపీ మిత్రపక్షమైన అకాలీదళ్, బీఎస్పీ, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకేలు ఒపీనియన్ పోల్స్‌పై నిషేధం విధించాలని సూచించగా, ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక ఈ పోల్స్‌ను నియంత్రించాలని సీపీఎం, సీపీఐ సూచించాయి. ఒపీనియన్ పోల్స్ నిర్వహించడంపై తమకేమీ అభ్యంతరం లేదని, అయితే, ఎన్నికల తేదీలు ప్రకటించి, కోడ్ అమలులోకి వచ్చాక వాటి ఫలితాలను వెల్లడించకుండా చూడాలని సీపీఎం, సీపీఐ కోరాయి. తటస్థ ఓటర్లపై ఇవి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని వామపక్షాలు పేర్కొన్నాయి. ఈ అంశంపై ఈసీ నిర్ణయానికి అనుగుణంగానే నడుచుకుంటామని తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించింది. బీజేపీ మాత్రం ఈ అంశంపై ఈసీకి తన అభిప్రాయాన్ని ఇంకా పంపాల్సి ఉంది. అయితే, బీజేపీ నేత అరుణ్ జైట్లీ ఢిల్లీలో ఈ అంశంపై ఒక వ్యాసాన్ని విడుదల చేశారు. ఒపీనియన్ పోల్స్ దేశంలో ఇప్పుడిప్పుడే మొదలయ్యాయని, కొన్నింటి అంచనాలు తప్పుగా వెలువడినంత మాత్రాన వాటిపై నిషేధం విధించాలనడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఒపీనియన్ పోల్స్ కూడా భావప్రకటన స్వేచ్ఛలో భాగమేనని, వాటిని నిషేధించడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఇటీవలి ఒపీనియన్ పోల్స్‌లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయని గుర్తు చేశారు. ఒపీనియన్ పోల్స్ విశ్వసనీయత మాట ఎలా ఉన్నా, వాటిని నిషేధించడం తగదన్నారు. ఈసీ ఈ వివాదానికి దూరంగా ఉండాలన్నారు. మరోవైపు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఒపీనియన్ పోల్స్‌ను నిషేధించాలన్న కాంగ్రెస్ డిమాండ్‌పై తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్‌వి పిల్ల చేష్టలని విమర్శించారు. ‘ఒపీనియన్ పోల్స్‌నే కాదు, బ్యాలెట్ పోల్స్‌నూ తిరస్కరించమనండి... ఇప్పుడు వీటిని నిషేధించాలంటున్న వారు ఇకపై ఎన్నికల సమయంలో రాసే వ్యాసాలు, సంపాదకీయాలు, బ్లాగ్‌లనూ నిషేధించాలంటారు. ఎన్నికల్లో ఓడిపోతే ఎన్నికల కమిషన్‌పైనా నిషేధం విధించాలంటారు... ఒకవేళ కోర్టుల నుంచి వారికి అనుకూలంగా ఆదేశాలు రాకుంటే, వాటినీ నిషేధించాలంటారు’ అని వ్యాఖ్యానించారు.
ఈసీ ప్రతిపాదనకు మద్దతిచ్చాం: కాంగ్రెస్
ఒపీనియన్ పోల్స్ అంశంలో తమ పార్టీ కేవలం ఎన్నికల కమిషన్ ప్రతిపాదనకు మద్దతు ప్రకటించిందని, అయితే, తమ పార్టీ ఒపీనియన్ పోల్స్‌ను వ్యతిరేకిస్తున్నట్లుగా అనవసర రాద్ధాంతం చేస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మీమ్ అఫ్జల్ అన్నారు. ఈ అంశంలో ఎన్నికల కమిషన్ ప్రతిపాదనపై తమ అభిప్రాయాన్ని వెల్లడించామని, ఒపీనియన్ పోల్స్‌ను కాంగ్రెస్ నిషేధించాలంటోందని ప్రచారం చేయడం సరికాదని అన్నారు. అయితే, పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ మాత్రం ఒపీనియన్ పోల్స్ అంతా వట్టి బూటకమని, వాటిని నిషేధించాల్సిందేనని అన్నారు. ఎవరైనా డబ్బు వెదజల్లి తమకు అనుకూలంగా ఒపీనియన్ పోల్స్ అంచనాలు రాబట్టుకోవచ్చని, ఇదంతా ఒక రాకెట్‌లా మారిందని కేంద్ర మంత్రి రాజీవ్ శుక్లా విమర్శించారు.