స్టార్ క్రికెటర్ పొలిటికల్ ఎంట్రీ!
సమకాలీన క్రికెట్ లో విలక్షణ విధ్వంసకారుడిగా పేరు పొందిన స్టార్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు. సమీప భవిష్యత్ లోనే పాకిస్థాన్ రాజకీయాల్లోకి ప్రవేశించనున్నట్లు తెలిపాడు. ఇప్పటికే 'షాహిద్ అఫ్రిది ఫౌండేషన్' ఫౌండేషన్ ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోన్న అఫ్రిది.. ప్రజలకు మరింత సేవ చేసేందుకే పాలిటిక్స్ లోకి రాబోతున్నట్లు పేర్కొన్నాడు. లాహోర్ లోని తన నివాసం నుంచి 'బీబీసీ ఉర్దూ' వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఫ్రిది తన మనోభావాలను వెల్లడించాడు.
'నా దృష్టిలో రాజకీయ నాయకులంటే ప్రజా సేవకులు. వారి పరమ ధర్మం ప్రజా సేవే అయి ఉండాలి. నిజానికి నేను రాజకీయాల్లోకి రాకపోయినా ప్రజాసేవ చేయగలను. మా ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే చాలా కార్య్రమాలు అమలవుతున్నాయి. అయితే మరింత మందికి సేవచేసేందుకే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నా. రాజకీయాల్లోకి వెళ్లొద్దని ఆప్త మిత్రులు కొందరు సలహా ఇచ్చారు. నేను మాత్రం భవిష్యత్ జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేయాలని నిర్ణయించుకున్నా' అంటూ తన ప్రణాళికను వివరించాడు అఫ్రిది. (చదవండి: ఆఫ్రిది.. నువ్వెప్పుడు?)
ఇంటర్నేషనల్ క్రికెట్ లో పాక్ తరఫున అత్యధిక మ్యాచ్ లు ఆడిన ఆటగాళ్లలో ఒకడైన షాహిద్ అఫ్రిది.. అధికారికంగా వన్ డే, టెస్ట్ లకు గుడ్ బై చెప్పలేదు. ప్రస్తుతం ఇంగ్లీష్ కౌంటీల్లో హాంప్ షైర్ జట్టుకు ఆడుతున్నాడు. మళ్లీ జట్టులోకి ప్రవేశించే అవకాశాలు దాదాపు కనుమరుగవుతున్న నేపథ్యంలోనే పొలిటికల్ ఎంట్రీపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.