ముంబై: ముంబైలోని శక్తిమిల్స్‌లో ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితులను స్థానిక సెషన్స్‌కోర్టు దోషులుగా నిర్ధారించింది. నిందితులకు మరణశిక్షకూడా విధించేందుకు అవకాశముంది. భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సవరించిన సెక్షన్ 376(ఈ) ప్రకారం విజయ్ జాదవ్ (19), కాసిమ్ బెంగాలి (21), మహమ్మద్ సలీమ్ అన్సారీలను(28) దోషులుగా నిర్ధారిస్తూ ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి షాలిని ఫన్సల్కర్ జోషి గురువారం తీర్పుచెప్పారు. కాగా ఈ ముగ్గురు నిందితులకు ఓ టెలిఫోన్ ఆపరేటర్‌పై అత్యాచారానికి పాల్పడినందుకు ఇప్పటికే యావజ్జీవ శిక్ష పడింది. తాజా కేసులో అదేతరహా నేరానికి మరోసారి పాల్పడినందుకు సవరించిన సెక్షన్ ప్రకారం శిక్ష విధించనున్నారు. 2012లో ఢిల్లీ గ్యాంగ్‌రేప్ ఘటన అనంతరం ఐపీసీలో సెక్షన్ 376(ఈ)ను పొందుపరిచారు. దీని ప్రకారం శిక్షను పెంచేందుకు వీలుంటుంది.
సెషన్స్‌కోర్టు శుక్రవారం వీరికి శిక్షను ప్రకటించే అవకాశముంది. దేశంలో తొలిసారిగా ఈ సెక్షన్ ప్రకారం శిక్షను ప్రకటించనున్నారు. హేయమైన నేరాలకు పాల్పడే ధోరణికి అడ్డుకట్ట వేయడానికి శాసన కర్తలు ఈ సెక్షన్‌ను రూపొందించారని జడ్జి షాలిని జోషి పేర్కొన్నారు. తాజా కేసులో చార్జిషీటు నమోదు చేసేనాటికే నిందితులకు గత నేరానికి సంబంధించిన కేసులో శిక్ష పడిన అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నట్టు ఆమె తెలిపారు. ఈ నిందితులు గతంలో కూడా ఇదే తరహాలో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, శిక్షకూడా పడిందని ప్రాసిక్యూషన్ నిరూపించినట్టు జడ్జి పేర్కొన్నారు.
అదే అకృత్యం
పాడుపడిన శక్తిమిల్స్‌లోనే ఈ నిందితులు గత ఏడాది జూలైలో ఓ 18 ఏళ్ల టెలిఫోన్ ఆపరేటర్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అదే ఏడాది ఆగస్టు 22న శక్తిమిల్స్ ఆవరణలోనే 22 ఏళ్ల ఫొటో జర్నలిస్టుపై అఘాయిత్యానికి ఒడిగట్టారు.