ఇడుపులపాయ నుంచి ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మరో యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి రోజైన సెప్టెంబర్ 2వ తేదీన ఆమె బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర మాదిరిగానే ఆమె ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్ద నుంచి బస్సు యాత్రకు బయలు దేరుతారని పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలు గురువారం తెలిపాయి.
రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయం దరిమిలా ఉత్పన్నమయ్యే నష్టాలపై ప్రజలను చైతన్యపర్చడానికి ఆమె ఈ యాత్ర చేపడుతున్నారని పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వెల్లడించారు. ఇప్పటికే షర్మిల 3,112 కిలోమీటర్ల పాదయాత్రను ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ చేసి చరిత్ర సృష్టించడం తెలిసిందే. బస్సుయాత్ర చేపడితే షర్మిల మరో మైలురాయి అధిగమించిన వారవుతారు.