
'అతడే... హీరో ఆఫ్ ది డే'
న్యూఢిల్లీ: పార్టీ నుంచి సస్పెండైన బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్ కు బాలీవుడ్ సీనియర్ నటుడు, పాట్నా ఎంపీ శత్రుఘ్నసిన్హా బాసటగా నిలిచారు. ఆజాద్ ను 'హీరో ఆఫ్ ది డే'గా వర్ణించారు. అవినీతికి వ్యతిరేకంగా గళం విప్పిన ఆజాద్ వేటు వేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. సీనియర్ నేత అద్వానీని ఆదర్శంగా తీసుకోవాలని అరుణ్ జైట్లీకి సూచించారు. డీడీసీఏ కేసును రాజకీయంగా ఎదుర్కొవాలని సలహాయిచ్చారు.
'కీర్తి ఆజాద్- ఈ రోజు హీరోగా నిలిచాడు. అవినీతి గురించి వెల్లడించిన ఆజాద్ పై అనాలోచిత చర్యలు మానుకోవాలని పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నా. న్యూటన్ మూడో సూత్రం మర్చిపోరాదు. చర్యకు ప్రతిచర్య తప్పకుండా ఉంటుంది. తనపై వచ్చిన ఆరోపణలను ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ రాజకీయంగా ఎదుర్కొవాలి గానీ చట్టపరంగా కాదు. ఎల్ కే అద్వానీ లా నిష్కళంకంగా బయటపడాలని అరుణ్ జైట్లీకి సూచించాలని డాషింగ్ డైనమిక్ ప్రధాని నరేంద్ర మోదీని కోరుతున్నా' అని శత్రుఘ్నసిన్హా ట్వీట్ చేశారు.