మోదీ వద్దకు డీడీసీఏ పంచాయితీ!
న్యూఢిల్లీ : బీజేపీ నుంచి సస్పెన్షన్కు గురైన ఎంపీ కీర్తి ఆజాద్...ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కోరారు. ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నిధుల దుర్వినియోగంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పాత్ర ఉందని కీర్తి ఆజాద్ ఆరోపణలు సంధించిన విషయం తెలిసిందే. సొంత పార్టీకి చెందిన కేంద్ర ఆర్థికమంత్రిపై బహిరంగంగా వ్యాఖ్యలు చేసి, ట్వీట్ల యుద్ధం ప్రకటించిన ఆయనపై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసింది.
ఈ నేపథ్యంలో కీర్తి ఆజాద్...ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. '1996లో ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీని అహ్మదాబాద్లో కలిశా. అప్పట్లో ఆయన జనరల్ సెక్రటరీగా పనిచేసేవారు. ఆ సమయంలో మోదీతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. నా అభ్యర్థనను ఆయన సానుకూలంగా విని న్యాయం చేస్తారని భావిస్తున్నా' అని కీర్తి అజాద్ నిన్న అహ్మదాబాద్లో పేర్కొన్నారు. మరోవైపు కీర్తి అజాద్ సస్పెన్షన్పై బీజేపీ సీనియర్ నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నారు.