మోదీ హవానే ఉంటే..ప్రచార సభలు ఎందుకు?
ముంబై: ఎన్నికలు దగ్గరపడుతుండటంతో మహారాష్ట్రలో రాజకీయం వేడెక్కుతోంది. ప్రధాన పార్టీలన్నీ తమ ఆరోపణలను మరింత పదును పెడుతున్నాయి. ప్రధాని మోదీ ముమ్మర ప్రచారంపై శివసేన.. ‘బీజేపీ చెబుతున్నట్లుగా మోదీ హవానే ఉంటే.. మోదీ ఇన్ని ప్రచార సభల్లో పాల్గొనడం ఎందుకు? ఖర్చు దండగ. ఢిల్లీలో కూర్చుని బీజేపీకి ఓటేయమంటే చాలు కదా. ప్రజలు ఓట్లేసేవారు!’ అని పార్టీ పత్రిక ‘సామ్నా’లో రాసిన సంపాదకీయంలో చురకలేసింది. ప్రధానిగా ఉంటూ ఊరూరు తిరుగుతూ ప్రచారం చేయడం ఆ పదవి ప్రతిష్టను దెబ్బతీయడమేనని, దాంతో పాటు ఆ పర్యటనల భారం కూడా ఖజానాపై భారీగానే పడుతుందని వ్యాఖ్యానించింది. దీనిపై వెంటనే స్పందించిన బీజేపీ.. ‘మోదీ ఫోబియా’కు ఆ వ్యాఖ్యలు నిదర్శనమంటూ తిప్పికొట్టింది.
మోదీ ఇన్ని సభల్లో పాల్గొనడం ఎందుకని ప్రశ్నించడం.. మైదానంలో సచిన్ టెండూల్కర్ పరుగులు చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించడం.. ఈ రెండూ ఒకటేనంటూ పార్టీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ ఎద్దేవా చేశారు.