బీజేపీ జైత్రయాత్ర!
సార్వత్రిక ఎన్నికల ఘన విజయం అనంతరం జరిగిన ఉప ఎన్నికలు కలిగించిన కలవరపాటు తాత్కాలికమేనని... తనది అప్రతిహత విజయపథమేనని ఆదివారం వెల్లడైన మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చాటిచెప్పింది. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 123 తెచ్చుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 145 సంఖ్యకు అది చేరలేకపోయినా... బహుముఖ సమరం జరిగిన చోట ఒంటరిగా పోటీచేసి ఇన్ని గెల్చుకోవడం ఆషామాషీ కాదు. 90మంది సభ్యులున్న హర్యానాలో బీజేపీ 47 స్థానాలు గెల్చుకుని సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నది. మహారాష్ట్ర ఇటు పశ్చిమంవైపు ఉంటే, హర్యానా ఉత్తరాది రాష్ట్రం. రెండుచోట్లా మునుపూ, ముందూ బీజేపీ సొంత కాళ్లపై నిలబడిన దాఖలాలు లేవు. మహారాష్ట్రలో శివసేనకు జూనియర్ భాగస్వామిగా అయిదేళ్లు అధికారంలో ఉన్నా, హర్యానాలో ఆ మాత్రం చరిత్ర కూడా బీజేపీకి లేదు. పక్కనున్న పంజాబ్‌లో అధికార కూటమిలో కొనసాగుతున్నా హర్యానాలో ఆ పార్టీకి ఎన్నడూ గరిష్టంగా 15 స్థానాలు మించలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అయితే ఆ పార్టీ గెల్చుకున్నవి నాలుగే నాలుగు సీట్లు! వాస్తవానికి ఈ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ అయిదు రోజులు అమెరికా పర్యటనలోనే వెచ్చించాల్సివచ్చింది. మోదీ ఇంకొన్ని రోజులు ప్రచారం చేయగలిగివుంటే తమ స్థితి మరింత మెరుగ్గా ఉండేదని చెబుతున్న బీజేపీ మాటల్లో అతిశయోక్తి లేదు. ఈ ఎన్నికల్లో రెండుచోట్లా కాంగ్రెస్ మూడో స్థానానికి దిగజారడం ఆ పార్టీ దయనీయ స్థితికి అద్దంపడుతున్నది.
దాదాపు సర్వేలన్నీ ఊహించినట్టే ఈ ఫలితాలు వెలువడ్డాయి. ఇది ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత విజయమని, ఆయన ఏరికోరి తెచ్చుకున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహరచనా చాతుర్యం దీనికి దోహదపడిందని వస్తున్న విశ్లేషణల్లో వాస్తవముంది. అయితే, ఇందులో కాంగ్రెస్ స్వయంకృతం ఎంతో విస్మరిస్తే ఈ విశ్లేషణలు అసంపూర్ణమే అవుతాయి. వరసగా పదిహేనేళ్లపాటు ఎన్సీపీతో కలిసి మహారాష్ట్రను ఏలిన కాంగ్రెస్ కొడిగట్టిన దాఖలాలు గత మూడు, నాలుగేళ్లుగా కనిపిస్తూనే ఉన్నాయి. కేంద్రంలోని యూపీఏ సర్కారుతో పోటీపడుతున్నట్టు వరస కుంభకోణాల్లో ఆ కూటమి సర్కారు కూరుకుపోయింది. కాంగ్రెస్ వల్లించే ఆదర్శాలకూ, వాస్తవానికీ శతసహస్ర యోజనాల దూరమున్నదని అక్కడ వెల్లడైన ఆదర్శ్ హౌసింగ్ స్కాం బయటపెట్టింది. కార్గిల్‌లో దేశం కోసం ప్రాణాలర్పించినవారి కుటుంబాలకూ, సైన్యంలో పనిచేసి రిటైరైన వారికోసమూ నిర్మించతలపెట్టిన భవన సముదాయంలోకి మూషికాల కన్నా ముందే చొరబడి అక్కడి ఫ్లాట్లలో సింహభాగాన్ని కూటమిలోని మిత్రులిద్దరూ కైంకర్యం చేశారని వెల్లడైనప్పుడు అందరూ నిర్ఘాంతపోయారు. ఇదే అనుకుంటే దీన్ని మించి వేయి కోట్ల రూపాయల విద్యా కుంభకోణం, రూ.70,000 కోట్ల ఇరిగేషన్ స్కాం మహారాష్ట్ర ప్రజలను దిగ్భ్రమకు గురిచేశాయి. అందరి నిర్వాకమూ గమనించాక పార్టీ పరువుప్రతిష్టలను ఎంతో కొంత పునరుద్ధరించగలడన్న ఆశతో సోనియాగాంధీ తన విశ్వాసపాత్రుడైన పృథ్వీరాజ్ చవాన్‌ను అక్కడికి సీఎంగా పంపినా లాభం లేకపోయింది. మృత్యుముఖంలో ఉన్నవారికి తులసితీర్థం పోయడం మన సంప్రదాయం. కానీ, పృథ్వీరాజ్ కొన ఊపిరితో ఉన్న కాంగ్రెస్ పీక నొక్కారు. పోలింగ్‌కు ఒకరోజు ముందు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో... స్కాంల విషయంలో తాను చర్య తీసుకోవడం ప్రారంభిస్తే రాష్ట్రంలో తమ పార్టీ పెద్దలంతా జైలుకు పోవాల్సివచ్చేదని చెప్పి దాని ఓటమిని ఖాయపరిచారు. సొంత మనుషులనుకున్నవారే ఇలా పార్టీకి పాడెగట్టడం సోనియాకు కొత్తగాదు. అన్ని రాష్ట్రాల్లోనూ ఎదురవుతున్న అనుభవమే. వరసగా రెండుసార్లు పాలించిన హర్యానాలో కూడా కాంగ్రెస్ ఈసారి మూడో స్థానానికి దిగజారడానికి ప్రధాన కారణం అవినీతే. సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు ప్రమేయమున్నదని ఆరోపణలొచ్చిన భూ కుంభకోణంతోపాటు అటవీ కుంభకోణం, పట్టణాభివృద్ధి సంస్థ కుంభకోణం వంటివి కాంగ్రెస్ ప్రతిష్టను పాతాళానికి నెట్టాయి. ఈ స్కాంలను వెల్లడించిన అశోక్ ఖేమ్కా, సంజీవ్ చతుర్వేది వంటి సీనియర్ సివిల్ సర్వీస్ అధికారులను కాంగ్రెస్ సర్కారు పెట్టిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రజాదరణ చెక్కుచెదరలేదని ఫలితాలు నిరూపించాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి పోలైన ఓట్లు 27.8 శాతం. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో శివసేనతో పొత్తు పెట్టుకుని 48 లోక్‌సభ స్థానాల్లో ఇరవైమూడింటిని కైవసం చేసుకున్నప్పుడు బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం 27.3. ఒంటరి పోరుకు సాహసించినా ఆ పార్టీ బలం చెక్కుచెదరలేదని ఈ ఎన్నికలు నిరూపించాయి. ప్రమోద్ మహాజన్, గోపీనాథ్ ముండే వంటి సీనియర్ నేతలను కోల్పోయాక బీజేపీకి ఆ రాష్ట్రంలో చెప్పుకోదగ్గ ముఖ్య నేతలు లేరు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఎన్నికల ప్రచారానికి దాదాపు దూరంగానే ఉన్నారు. సరిగ్గా ఈ బలహీనతను ఆసరా చేసుకునే శివసేన తమకు అధిక స్థానాలు కావాలని పట్టుబట్టింది. అయితే, తనకున్న జనాకర్షణ శక్తితో మోదీ పార్టీని సునాయాసంగా గెలిపించారు. ఇప్పుడు ఫలితాలు కలిగించిన జ్ఞానోదయంతో బీజేపీకి మద్దతిచ్చే దిశగా శివసేన కదులుతున్నదని అక్కడి పరిణామాలు తెలియజేస్తున్నాయి. వారు కాదంటే మద్దతివ్వడానికి ఇటు ఎన్సీపీ కూడా సిద్ధపడుతున్నది. మహారాష్ట్ర తరహాలోనే హర్యానాలో కూడా బీజేపీకి నాయకత్వ కొరత ఉంది. అయినా అక్కడ బీజేపీ 33.2 శాతం ఓట్లు సాధించింది. సహజంగానే రెండుచోట్లా బీజేపీలో ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీపడేవారి సంఖ్య ఇప్పుడు ఎక్కువగానే ఉంది. ఇప్పటికే పార్టీపై పూర్తి పట్టు సాధించిన మోదీ ఈ సమస్యను సునాయాసంగానే పరిష్కరించగలరనుకోవచ్చు. మొత్తానికి ఈ రెండు విజయాలూ బీజేపీ బాధ్యతను మరింత పెంచాయి.