10వేల ఏళ్లలో ఇదే చెత్త పాలన...
న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంపై బీజేపీసోదర పార్టీ శివసేన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. పదివేల ఏళ్లలో ఇంత దారుణమైన చెత్త పాలనను చూడలేదంటూ మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడింది. డీమానిటైజేషన్, మహిళల కష్టాలపై స్పందించిన శివసేన బీజేపీపై పదునైన వ్యాఖ్యలతో మరోసారి దాడికి దిగింది. అంతేకాదు పెద్ద నోట్ల రద్దుతో మహిళల్నిభారీ కష్టాల్లోకి నెట్టేసిన తరువాత కూడా నల్లధనం నిర్మూలన అంటూ బీజేపీ ఎమ్మెల్యేలు ఫూల్స్ పారడైజ్ లో జీవిస్తున్నారని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో విమర్శించింది.
ఆర్ బీఐ కార్యాలయం ముందు ఓ మహిళ చేపట్టిన ఆందోళన నేపథ్యంలో శివసేన స్పందించింది. ఓ బాధిత మహిళ గోడు కనలేని వినలేని క్రూరమైన మరియు చెవిటి పాలన గత 10 వేల సంవత్సరాలలో ఉనికిలో లేదని పేర్కొంది. పెద్దనోట్ల రద్దుతో నల్లధనాన్ని నిర్మూలించినట్టు బీజేపీ సంబరపడుతోందనీ, కానీ పేదమధ్య తరగతి ప్రజలు, నిరుద్యోగులు చాలా బాధలు పడ్డారని ఆరోపించింది. దీన్నికూడా జాతీయవాదంగా మీరు చెబితే మీ మెదళ్ళకు చికిత్సకు తాలిబన్ వైద్యుడు అవసరముందంటూ బీజీపేనుద్దేశించి వ్యాఖ్యానించింది. మహిళలపై ఇలాంటి అమానుష దాడులు తాలీబన్ పద్ధతుల్లో మాత్రమే జరుగుతాయని అని శివసేన చెప్పింది. ఇది ప్రభుత్వమే ఉసికొల్పిన నిర్భయ విషాదం లాంటిదంటూ సామ్నా సంపాదకీయంలో మండిపడింది.
పనిలో పనిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పై తన దాడిని ఎక్కుపెట్టింది శివసేన. నిస్సహాయమైన మహిళకు మద్దతిస్తారా, పెద్ద నోట్ల రద్దుకు మద్దుతిస్తారో తేల్చుకోవాలంటూ సీంఎకు సవాల్ విసిరింది. ఈ మహిళ దుర్దశను చూసిన తరువాత కూడా పెద్ద నోట్లరద్దకు గట్టి మద్దతు ఇస్తున్న సీఎం కడుపు మండక పోవడం అతని నిస్సహాయత్వాన్ని తెలుపుతోందని పేర్కొంది.
కాగా రెండు రోజులక్రితం ఢిల్లీలోని ఆర్ బీఐ కార్యాలయం ముందు ఓ మహిళ టాప్ లెస్ గా ఆందోళనకు దిగింది. తన దగ్గర ఉన్నకొద్దపాటి పాతనోట్ల మార్పిడి ప్రయత్నించి విఫలం కావడంతో నిరసనదిగడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే.