బెయిల్ వచ్చిందనుకుని ఆనందం, రాలేదన్న వార్తతో నైరాశ్యం
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆస్తుల కేసుకు సంబంధించి, బెంగళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు మంగళవారం తొలుత బెయిల్ వచ్చిందనుకుని సంబరాలు జరుపుకున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు అంతలోనే బెయిల్ రాలేదని తెలుసుకుని నైరాశ్యంలో మునిగారు. ఈ కేసులో నాలుగేళ్ల జైలు శిక్షను ఎదుర్కొంటున్న జయ బెయిల్ పిటిషన్‌పై మంగళవారం కిక్కిరిసిన హైకోర్టులో ఎంతోఉత్కంఠగా వాదోపవాదాలు సాగాయి. ఈ దశలో, జయలలితకు షరతులతో కూడిన బెరుుల్ మంజూరుకు తమకు అభ్యంతరం లేదని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఎస్‌పీపీ) భవానీ సింగ్ ప్రసాద్ ప్రకటించారు.
ఈ సమాచారం బయటకు పొక్కడంతో అమ్మకు ఇక బెయిల్ ఖాయం అంటూ తమిళనాడులోని అమ్మ అభిమానులంతా ఆనందోత్సాహాల్లో మునిగితేలారు. దీనికి తోడు జయుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైనట్టు అన్నా డీఎంకే ఆధ్వర్యంలోని జయ టీవీసహా పలు టెలివిజన్ చానళ్లు, న్యూస్ వెబ్‌సైట్లు వార్తలు వెలువరించడంతో చెన్నైలోని అన్నాడీఎంకే కార్యాలయం, పోయెస్ గార్డెన్‌లోని జయులలిత నివాసం వద్ద సంతోషం వెల్లివిరిసింది.
చెన్నైలోని పలు రోడ్ల కూడళ్లలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు బాణసంచా కాల్చారు. మిఠాయిలు పంచిపెట్టారు. అయితే,.. వారి ఆనందం ఎంతో సేపు నిలవలేదు.. ఇంతలోనే పిడుగుపాటు వంటి వార్తతో వారు నైరాశ్యంతో కుంగిపోయారు. కండీషనల్ బెరుుల్‌పై ఎస్‌ఎస్‌పీ వాదనతో హైకోర్టు ఏకీభవించలేదని, జయకు బెయిల్ మంజూరు కాలేదని తెలిసి, ఆవేదన చెందారు. ఎక్కడికక్కడ రాస్తారోకోకు దిగారు. మహిళలు గుండెలవిసేలా రోదించారు. ఊటీ బస్‌స్టాండ్‌లో కర్ణాటక ఆర్టీసీ బస్సును వందవుంది అన్నాడీఎంకే కార్యకర్తలు నిలివేశారు. పోలీసులు వెంటనే వారిని చెదరగొట్టి బస్సును సురక్షిత ప్రాంతానికి తరలించారు. తమిళనాడు, కర్ణాటక సరిహద్దులోని అత్తిపల్లి వద్ద కర్ణాటక పోలీసులు మంగళవారం భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, అన్నాడీఎంకే కార్యకర్తలను అడ్డుకున్నారు.