
లాలూపై 'షాట్ గన్' సానుభూతి
పాట్నా: దాణా కుంభకోణంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకెళ్లడంపై బీజేపీ సీనియర్ నాయకుడు శత్రుఘ్న సిన్హా సానుభూతి వ్యక్తం చేశారు. ఎగువ కోర్టు తీర్పుతో ఆయన త్వరలో జైలు నుంచి బయటకు రావాలని ఆకాంక్షించారు. లాలూ స్నేహితుడిగా ఆయన జైలుకు వెళ్లడాన్ని జీర్ణించుకోలేపోతున్నానని పాట్నా విమానాశ్రయంలో విలేకరులతో అన్నారు. క్లిష్టపరిస్థితుల నుంచి లాలూ త్వరగా బయటపడాలని కోరుకుంటున్నానని చెప్పారు.
బాలీవుడ్లో షాట్ గన్గా పేరుగాంచిన శత్రుఘ్న సిన్హా అనేక సందర్భాల్లో పార్టీని ఇబ్బందులకు గురిచేసే విధంగా మాట్లాడారు. తాజాగా లాలూకు అనుకూలంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చినీయాంశంగా మారాయి. అయితే లాలూతో ఆయనకు రాజకీయాల్లోకి రాకముందునుంచే స్నేహం ఉంది. పాట్నా యూనివర్సిటీలో శత్రుఘ్న సిన్హాకు లాలూ సీనియర్. పాట్నా లోక్సభ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు.