
రష్యా భారీ కార్చిచ్చు.. ఐదుగురి మృతి
రష్యాలోని సైబీరియాలో కార్చిచ్చు తలెత్తి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు.
మాస్కో: రష్యాలోని సైబీరియాలో కార్చిచ్చు తలెత్తి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. వందల మంది తమ నివాసాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. దక్షిణ సైబిరియాలో దాదాపు 560 మంది సెలవుదినం కావడంతో విడిది కోసం అటవీ ప్రాంతానికి వెళ్లి అక్కడ తాత్కళికంగా ఏర్పాటుచేసుకున్న నివాసాల్లో ఉన్నారు. అనుకోకుండా అక్కడ ఉన్న ఎండుగడ్డికి నిప్పు అంటుకోవడంతో అప్పటికే బలంగా వీస్తున్న గాలుల వల్ల మంటలు వేగంగా వ్యాపించాయి.
దీంతో ప్రాణనష్టం చోటుచేసుకుంది. 62 మందికి గాయాలవ్వగా.. 11మంది పరిస్థితి విషమంగా ఉంది. విమానాలు, హెలికాప్టర్లు, రైళ్ల ద్వారా మంటలను ఆర్పేందుకు దాదాపు 5,000 వేల మంది రంగంలోకి దిగారు. అయినప్పటికీ మంటలు అదుపులోకి తీసుకురావడం కష్టమై పోయింది. 16 గ్రామాలను మంటల బారిన పడకుండా రక్షించగా.. 42 గ్రామాల్లో 900 భవనాలు మంటల బారిన పడ్డాయి. భారీ స్థాయిలో ఆస్తి నష్టం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు.