మనం కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీలకు తగ్గితేనే గజగజ వణికిపోతాం. మరి ప్రపంచంలో అత్యంత చల్లగా ఉండే ప్రాంతంలో ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? అది ఎక్కడుంది? అనే విషయాలేంటో చూద్దాం! – సాక్షి, సెంట్రల్ డెస్క్
మైనస్ 60 డిగ్రీలు..
అంటార్కిటికా అత్యంత చల్లగా ఉండే ఖండం అని అందరికీ తెలిసిందే. అక్కడ జనాభా ఉండదు. అక్కడికి కేవలం కొంతమంది శాస్త్రవేత్తలు పరిశోధనల నిమిత్తం వచ్చి వెళ్తుంటారు. ఇదికాకుండా ప్రపంచంలో అత్యంత చల్లగా ఉండే ప్రదేశం ఏంటంటే.. రష్యాలో సైబీరియాలోని యాకుత్స్క్ నగరం. తక్కువ జనాభా ఉండే ప్రాంతాల్లో ఇదొకటి. ఇక్కడి జనాభా 3,36,200. వీరిలో ఎక్కువ మంది అల్రోసా అనే కంపెనీ నిర్వహించే వజ్రాల గనిలో పనిచేస్తుంటారు. ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ 60 డిగ్రీలు. అయితే అంతకంటే ఎక్కువ చలిని కూడా తాము అనుభవించినట్లు స్థానికులు చెబుతారు. అయితే ఉష్ణోగ్రతను కొలిచేందుకు వినియోగించే థర్మామీటర్‌లో మైనస్ 63 డిగ్రీలే గరిష్టంగా చూపుతుంది. అంతకంటే ఎక్కువ ఉన్నా ఇది చూపలేదు.
ఇంకోటి కూడా ఉంది..
యాకుత్స్క్ నగరం అత్యంత శీతల ప్రాంతమైనప్పటికీ దీనికంటే ఎక్కువ చలి ఉన్న ప్రాంతం ఇంకోటి ఉంది. అదేంటంటే ఒమికోన్. అది కూడా రష్యాలోనే ఉంది. అక్కడ జనాభా 500లోపే. ఇక్కడ 1924లో ఉష్ణోగ్రత మైనస్ 71.2 డిగ్రీలు నమోదైంది. అయితే, ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. యాకుత్స్స్, ఒమికోన్ ప్రాంతాలు దగ్గర దగ్గరగా ఉండవు. రెండింటి మధ్య దూరం 928 కిలోమీటర్లు. ఒకచోటి నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లాలంటే 21 గంటలకు పైనే పడుతుంది.
ఎక్కువగా చల్లగా ఎందుకంటే..?
సైబీరియాలో అత్యంత చలి ఎందుకు ఉంటుంది.. అంటే ఇది అత్యంత ఎత్తులో ఉండటంతోపాటు ల్యాండ్‌మాస్ పెద్దఎత్తున ఉంటుందని పెన్సిల్వేనియాలోని మిల్లెర్స్‌విల్లే యూనివర్సిటీ ప్రొఫెసర్ అలెక్స్ డికారియా చెప్పారు.
సాధారణంగా మహాసముద్రాల్లో కంటే కూడా భూమి త్వరగా వేడెక్కుతుంది..అంతే వేగంగా చల్లగా మారిపోతుంది. అందుకే భూ ఉపరితలం మీద ఉష్ణోగ్రతలు అత్యంత ఎక్కువగా, తక్కువగా నమోదవుతుంటాయి. అదే సైబీరియా విషయానికొస్తే.. మంచు కీలక పాత్ర పోషిస్తుంది. సూర్యుడి నుంచి వచ్చే వేడిని ఈ మంచు అంతరిక్షంలోకి వెనక్కి పంపుతుంది. అందువల్ల సైబీరియాలో అత్యంత చల్లగా ఉంటుందని చెబుతారు.
సాధారణంగా ఎక్కువ ఎత్తులో ఉండే ప్రాంతంలో పీడనం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అక్కడ గాలి స్థిరంగా ఉంటుంది. దీనికితోడు తక్కువ తేమ శాతం ఉండటంతోపాటు ఆకాశం కూడా నిర్మలంగా ఉంటుంది. దీంతో భూఉపరితలం చాలా చల్లగా ఉంటుందని అంటారు అలెక్స్ డికారియా. తక్కువ తేమశాతం, నిర్మలమైన ఆకాశం వల్ల భూమి నుంచి వచ్చే రేడియేషన్ వాతావరణంలో పైభాగానికి చేరి తద్వారా అంతరిక్షంలోకి వెళ్తుంది. దీని ఫలితంగా భూఉపరితలం చల్లగా ఉంటుంది. సైబీరియా చాలా సురక్షితమైన ప్రాంతమని చెబుతారు స్థానికులు. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి ఉగ్రవాద దాడులు ఉండవు. విపత్తులు కూడా ఉండవు. దీనికితోడు వాతావరణ కాలుష్యం బెడద అసలే ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment