
ఆ స్థానం నుంచే మా ఆయన పోటీ: సిద్ధు భార్య
న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధమవుతున్నారు. అమృత్‌సర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీచేసే అవకాశముందని ఆయన భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధు బుధవారం మీడియాకు తెలిపారు. 'మా ఆయన అమృత్ సర్ ఈస్ట్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశముంది' అని ఆమె పేర్కొన్నారు.
నవజ్యోత్ సింగ్ సిద్ధు, ఆయన భార్య గత ఏడాది బీజేపీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. సిద్ధు భార్య కౌర్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిద్ధు కూడా కాంగ్రెస్ గూటికి చేరే అవకాశముందని తెలుస్తోంది. 2012 ఎన్నికల్లో సిధ్దు పటియాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2004 ఎన్నికల్లో అమృత్‌సర్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన గెలుపొందారు. తనను పంజాబ్‌కు దూరం పెట్టాలనే కుట్రతో బీజేపీ వ్యవహరిస్తున్నదని, అందుకే ఆ పార్టీకి రాంరాం చెప్పినట్టు సిద్ధు గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.