చండీగఢ్: ‘పంజాబ్ కొత్త కేబినెట్ ప్రమాణస్వీకార కార్యక్రమం రాజ్‌భవన్‌లో జరగదు. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్ కలన్‌లో నిర్వహిస్తాం’ అని ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ వెల్లడించారు. కార్యక్రమం తేదీలను తర్వాత ప్రకటిస్తామని చెప్పారు. ఏ సర్కారు ఆఫీసులో కూడా ముఖ్యమంత్రి చిత్రపటాలు ఉండవని స్పష్టం చేశారు. బదులుగా భగత్‌సింగ్, అంబేద్కర్ ఫొటోలు ఉంటాయన్నారు.
ఇప్పుడిక పంజాబ్‌ను మళ్లీ పంజాబ్‌గా మారుస్తామని చెప్పారు. పంజాబ్ ప్రజలు ఆప్‌కు పట్టం కట్టారని ట్రెండ్‌ను బట్టి తెలియడంతో ధురిలో పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో మాన్ మాట్లాడారు. పాఠశాలల స్థితిగతులను మెరుగుపరచడం, ఆరోగ్య మౌలిక సదుపాయాలు పెంచడం, పరిశ్రమలను తీసుకురావడం, సాగును లాభసాటిగా మార్చడం, మహిళలకు భద్రత కల్పించడం, క్రీడా మౌలిక సదుపాయాలను పెంచడం ప్రాధాన్యాంశాలని ఆయన వివరించారు. క్రీడలను ప్రోత్సహించడానికి గ్రామాల్లో ట్రాక్స్, స్టేడియంలు ఏర్పాటు చేస్తామన్నారు.
అన్ని ప్రాంతాల్లో మంత్రులు ఎప్పటికప్పుడు పర్యటిస్తుంటారని.. ప్రజల కష్టనష్టాలు తెలుసుకుంటారని చెప్పారు. ‘ఆప్‌కు ఓటేయని వాళ్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్ని వర్గాల ప్రజల కోసం పార్టీ పని చేస్తుంది’ అని చెప్పారు. ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థులను తిరిగి తీసుకురావడంపై స్పందిస్తూ.. ‘మన పిల్లలు చదువుకోవడానికి బయటకు ఎందుకు వెళ్లాలి. మనమే తక్కువకు సదుపాయాలు ఎందుకు కల్పించకూడదు’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment