ముగిసిన మండలి పోరు
సాక్షి, హైదరాబాద్: ప్రత్యర్థుల కొనుగోళ్లు.. జోరుగా వలసలు.. క్యాంపు రాజకీయాలు.. వెరసి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన స్థానిక కోటా శాసన మండలి ఎన్నికలు ఆదివారం ముగిశాయి. నాలుగు జిల్లాల పరిధిలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. ఆయా జిల్లాలకు చెందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యు లు, కౌన్సిలర్ల ఓట్లను కాపాడుకునేందుకు అధికార టీఆర్‌ఎస్, విపక్ష కాంగ్రెస్, టీడీపీలు క్యాంపులు నిర్వహించాయి. వీరంతా పోలింగ్ సమయానికి క్యాంపుల నుంచి తిరిగి వచ్చి ఓటింగ్‌లో పాల్గొన్నారు.
మహ బూబ్‌నగర్ , రంగారెడ్డి జిల్లాల్లో రెండే సి స్థానాలకు, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి మొత్తంగా ఆరు సీట్లకు ఓటింగ్ జరగ్గా.. 99 శాతం పోలింగ్ నమోదైంది. తొమ్మిది జిల్లాల పరిధిలో స్థానిక సంస్థల కోటాలోని 12 స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్ల ఉపసంహరణ నాటికే.. వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో ఒక్కో స్థానాన్ని కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలను మొత్తంగా ఆరు స్థానాలను టీఆర్‌ఎస్ ఏకగ్రీవంగా తన ఖాతాలో వేసుకుంది.
దీంతో మిగిలిన ఆరు స్థానాలకే ఎన్నికలు జరిగాయి. 33 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలో నిలిచినా.. ప్రధాన పోటీ టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే జరిగింది. ఖమ్మంలో కాంగ్రెస్ సహా టీడీపీ, బీజేపీ, సీపీఎం బలపరిచిన సీపీఐ, స్వతంత్రంగా బరిలోకి దిగిన వైఎస్సార్ కాంగ్రెస్ టీఆర్‌ఎస్‌తో పోటీ పడ్డాయి. నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ నెలకొంది.
ఎవరి ధీమాలో వారు..
స్థానిక సంస్థల్లో తమకున్న ఓట్ల సంఖ్యను బట్టి పోటీలో ఉన్న వివిధ పార్టీల అభ్యర్థులు తమ విజయంపై గట్టి నమ్మకంతో ఉన్నారు. ఎన్నికల ప్రచారం సమయంలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్ల బేరసారాలు జోరుగా సాగాయి. కాంగ్రెస్, టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి జోరుగా వలసలు సాగా యి. దీంతో ఆయా పార్టీల వాస్తవ ఓట్ల సంఖ్యలో భారీగా తేడాలు వచ్చాయి. దీంతో రెండేసి స్థానాలున్న మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్, టీడీపీలు ఒక్కో జిల్లాలో ఒక్కోస్థా నంలో పోటీ చేసి పరస్పర సహకారంపై అంగీకారానికి వచ్చాయి.
నల్లగొండలో కాం గ్రెస్, టీఆర్‌ఎస్‌లు ఢీ అంటే ఢీ అన్నాయి. చివరకు పోలింగ్ ముగిశాక ఏ పార్టీకి ఆ పార్టీ సొంత అంచనాల్లో మునిగిపోయాయి. గెలుపు తమదే అంటూ పార్టీలు లెక్కలు చెబుతున్నా.. క్రాస్ ఓటింగ్ భయమూ వెంటాడుతోంది. నల్లగొండ జిల్లాలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసే వ్యవహారంలో సొంత పార్టీకి చెందిన ఓటర్ల కంటే ఇతర పార్టీల వారికే టీఆర్‌ఎస్ ప్రాధాన్యం ఇచ్చిందని, దీంతో ఆ పార్టీకి చెందిన కొం దరు ఓటర్లు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమైంది.
30న లెక్కింపు...
ఈ నెల 30వ తేదీన ఆరు స్థానాల ఓట్ల లెక్కింపు జరగనుంది. నాలుగు జిల్లాల్లో ఆరు స్థానాల పరిధిలోని 3,893 ఓట్లకుగాను 3,817 ఓట్లు పోలయ్యాయి. నల్లగొండ జిల్లాలో 99 శాతం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలో 99.7 శాతం చొప్పున పోలింగ్ జరిగింది. ఖమ్మంలో కాస్త తక్కువగా 95.72 శాతం ఓట్లు పోలయ్యాయి.