బీజేపీలోకి ఆరుగురు ఎమ్మెల్యేలు జంప్!
అగర్తలా: కొన్ని దశాబ్దాలుగా కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న త్రిపురలో బీజేపీ పాగా వేయబోతున్నది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)కి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు సోమవారం బీజేపీలో చేరబోతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు ఓటు వేయడంతో ఇప్పటికే ఈ ఆరుగురిపై తృణమూల్ కాంగ్రెస్ అధినాయకత్వం వేటు వేసింది. గతంలో కాంగ్రెస్ తరఫున గెలిచిన వీరు.. అనంతరం తృణమూల్‌లోకి జంప్ కొట్టారు.
బీజేపీ 'ఆపరేషన్ త్రిపుర'ను కూడా ప్రారంభించినట్టు కనిపిస్తోంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఎన్నికలు జరగనున్న ఈ రాష్ట్రంలో కాషాయదళం ఎన్నడూ ఒక్క సీటును గెలువలేదు. ఇక్కడ గత కొన్నాళ్లుగా అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టుల ఎర్రజెండాలు రెపరెపలాడుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టుల కూటమి రాష్ట్రంలోని 60 స్థానాలకు 51 స్థానాలు గెలుపొందింది. ఈ నేపథ్యంలో ఆరుగురు ఎమ్మెల్యేలు కమలదళంలో చేరడం.. ఆ పార్టీకి కొత్త ఊపునిచ్చేదే. ఈ చేరికలతో త్రిపురలో బోణీ కొట్టాలని, రాజకీయంగా గట్టి పునాది ఏర్పరుచుకోవాలని బీజేపీ భావిస్తోంది. సుదీప్ రాయ్ బర్మన్ నేతృత్వంలోని తృణమూల్ రెబల్ ఎమ్మెల్యేలు సోమవారం లాంఛనంగా బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. వీరు ఇప్పటికే ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను కలిశారు.