Trinamool MLAs
-
దీదీకి మరో షాక్.. ఐదుగురు ఎమ్మెల్యేలు జంప్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో తృణమూల్ నేతలు వరుస పెట్టి కాషాయ కండువా కప్పుకుంటున్న విషయం విధితమే. తాజాగా సోమవారం ఐదుగురు తృణమూల్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బే తగిలింది. ఎమ్మెల్యేలు సోనాలి గుహ, సీతల్ సర్దార్, దీపేందు బిశ్వాస్, రవీంద్రనాథ్ భట్టాచార్య, జతు లహిరిలు కమల దళంలో చేరి దీదీకి గట్టి షాకిచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు హబీబ్పూర్ అభ్యర్థి సరళా ముర్ము కూడా బీజేపీ తీర్ధం పుచ్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. పోటీపడి మరీ టికెట్ తెచ్చుకున్న అభ్యర్ధులు కూడా పార్టీని వీడుతుండంతో దీదీకి పాలుపోవడం లేదు. పార్టీ ఫిరాయించిన నేతలంతా రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్, అగ్ర నేతలు సువేందు అధికారి, ముకుల్ రాయ్‌ల సమక్షంలో బీజేపీలో చేరారు. ఎన్నికలకు ముందు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కాషాయ పార్టీలో చేరడంతో తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది. గతవారం బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్ల సమక్షంలో మాజీ కేంద్ర రైల్వే మంత్రి, టీఎంసీ నేత దినేష్ త్రివేది బీజేపీలో చేరగా, ఇటీవల కోబ్రా మిథున్ చక్రవర్తి కూడా కమలదళంలో చేరారు. కాగా, 291 మంది సభ్యులున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 మధ్య ఎనిమిది విడతల్లో పోలింగ్ జరగనుంది. -
బీజేపీలోకి ఆరుగురు ఎమ్మెల్యేలు జంప్!
అగర్తలా: కొన్ని దశాబ్దాలుగా కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న త్రిపురలో బీజేపీ పాగా వేయబోతున్నది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)కి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు సోమవారం బీజేపీలో చేరబోతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు ఓటు వేయడంతో ఇప్పటికే ఈ ఆరుగురిపై తృణమూల్ కాంగ్రెస్ అధినాయకత్వం వేటు వేసింది. గతంలో కాంగ్రెస్ తరఫున గెలిచిన వీరు.. అనంతరం తృణమూల్‌లోకి జంప్ కొట్టారు. బీజేపీ 'ఆపరేషన్ త్రిపుర'ను కూడా ప్రారంభించినట్టు కనిపిస్తోంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఎన్నికలు జరగనున్న ఈ రాష్ట్రంలో కాషాయదళం ఎన్నడూ ఒక్క సీటును గెలువలేదు. ఇక్కడ గత కొన్నాళ్లుగా అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టుల ఎర్రజెండాలు రెపరెపలాడుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టుల కూటమి రాష్ట్రంలోని 60 స్థానాలకు 51 స్థానాలు గెలుపొందింది. ఈ నేపథ్యంలో ఆరుగురు ఎమ్మెల్యేలు కమలదళంలో చేరడం.. ఆ పార్టీకి కొత్త ఊపునిచ్చేదే. ఈ చేరికలతో త్రిపురలో బోణీ కొట్టాలని, రాజకీయంగా గట్టి పునాది ఏర్పరుచుకోవాలని బీజేపీ భావిస్తోంది. సుదీప్ రాయ్ బర్మన్ నేతృత్వంలోని తృణమూల్ రెబల్ ఎమ్మెల్యేలు సోమవారం లాంఛనంగా బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. వీరు ఇప్పటికే ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను కలిశారు. -
సీఎంకు ఝలక్.. ఆరుగురు ఎమ్మెల్యేలు జంప్!
అగర్తలా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి త్రిపురలో ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. త్రిపురకు చెందిన తృణమూల్ కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు బీజేపీకి చేరువవుతున్నారు. ఇప్పటికే పార్టీ వైఖరిని ధిక్కరించి రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు ఆరుగురు తృణమూల్ ఎమ్మెల్యేలు మద్దతు పలికిన సంగతి తెలిసిందే. దీంతో వారిపై పార్టీ అధినేత్రి మమత సస్పన్షన్ వేటు వేశారు. ఈ నేపథ్యంలో ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థి మీరాకుమార్‌కు మమతా బెనర్జీ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, త్రిపురలో అధికారంలో ఉన్న సీపీఎం కూడా మీరాకుమార్‌కే మద్దతుగా నిలిచింది. ఇది తృణమూల్ కాంగ్రెస్ త్రిపుర శాఖలో చీలిక తెచ్చింది. త్రిపురలో తమకు బద్ధ విరోధి అయిన సీపీఎం మద్దతునిచ్చిన అభ్యర్థి మీరాకుమార్‌కే తాము మద్దతునివ్వలేమంటూ తృణమూల్ ఎమ్మెల్యేలు ప్లేటు ఫిరాయించారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి కోవింద్‌కు మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో వారిపై పార్టీ అధినేత్రి మమత సస్పెన్షన్ విధించగా.. సదరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.