సీఎంకు ఝలక్.. ఆరుగురు ఎమ్మెల్యేలు జంప్!
అగర్తలా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి త్రిపురలో ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. త్రిపురకు చెందిన తృణమూల్ కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు బీజేపీకి చేరువవుతున్నారు. ఇప్పటికే పార్టీ వైఖరిని ధిక్కరించి రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు ఆరుగురు తృణమూల్ ఎమ్మెల్యేలు మద్దతు పలికిన సంగతి తెలిసిందే. దీంతో వారిపై పార్టీ అధినేత్రి మమత సస్పన్షన్ వేటు వేశారు. ఈ నేపథ్యంలో ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థి మీరాకుమార్‌కు మమతా బెనర్జీ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, త్రిపురలో అధికారంలో ఉన్న సీపీఎం కూడా మీరాకుమార్‌కే మద్దతుగా నిలిచింది. ఇది తృణమూల్ కాంగ్రెస్ త్రిపుర శాఖలో చీలిక తెచ్చింది. త్రిపురలో తమకు బద్ధ విరోధి అయిన సీపీఎం మద్దతునిచ్చిన అభ్యర్థి మీరాకుమార్‌కే తాము మద్దతునివ్వలేమంటూ తృణమూల్ ఎమ్మెల్యేలు ప్లేటు ఫిరాయించారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి కోవింద్‌కు మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో వారిపై పార్టీ అధినేత్రి మమత సస్పెన్షన్ విధించగా.. సదరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.