6 వేల గ్రామాలకు విద్యుత్ వెలుగులు
మౌలిక రంగాలపై ప్రధాని సమీక్షలో అధికారుల వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో విద్యుత్‌లేని సుమారు 18,500 గ్రామాలకుగాను ఇప్పటికే ఆరు వేల గ్రామాల్లో విద్యుత్ వెలుగులు అందించినట్లు కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ప్రధాన మంత్రి గ్రామీణ విద్యుదీకరణ పథకం కింద ఈ గ్రామాలకు కరెంటు అందించామని.తెలిపింది. మిగిలిన గ్రామాలకు విద్యుత్ సరఫరా ప్రక్రియ వేగంగా సాగుతోందని ప్రధాని కార్యాలయం (పీఎంవో) శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
విద్యుత్, గృహ నిర్మాణం, బొగ్గు, పోర్టులు, డిజిటల్ ఇండియా తదితర మౌలిక వసతుల రంగాల్లో పురోగతిపై ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఢిల్లీలో ఉన్నతాధికారులతో రెండున్నర గంటలపాటు సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు ఆయా రంగాల్లో అభివృద్ధి గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పిన వివరాలు..
♦ వామపక్ష తీవ్రవాద ప్రభావిత గ్రామాల్లో మొబైల్ సేవల కోసం కొత్తగా 1,371 టవర్ల ఏర్పాటు.
♦ 2022 నాటికి 175 గిగావాట్ల పునర్వినియోగ సామర్థ్యం లక్ష్యంలో భాగంగా ఇప్పటికే పునర్వినియోగ ప్రతిష్టాపిత ఇంధన సామర్థ్యం 39.5 గిగావాట్లకు పెంపు.
♦ గత ఐదేళ్లలో దేశంలో సగటున 3 శాతంగా ఉన్న కోల్ ఇండియా లిమిటెడ్ ఉత్పత్తి సామర్థ్యం ఈ సంవత్సరంలో 9.2 శాతానికి పెరుగుదల.
♦ దేశంలోని 12 ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో అందుబాటులోకి అత్యాధునిక వైఫై సేవలు.