ఫేస్బుక్ రిక్వెస్ట్ పంపి.. దొరికిపోయిన దొంగ!
మంచి రద్దీ ప్రదేశంలో ఓ దొంగ ఓ మహిళ పర్సు దొంగిలించాడు. దాన్ని తీసుకుని అతడు పారిపోతుంటే.. పూర్తిగా చూడకపోయినా అతడి చేతిమీదున్న టాటూను బాధితురాలు చూసింది. సరే ఏం చేస్తాం అనుకుని ఊరుకుంది. కొన్ని రోజుల తర్వాత అనుకోకుండా సదరు దొంగ.. ఆ బాధితురాలికి ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. అంతే, దొరికిపోయాడు!! ఈ సంఘటన అమెరికాలో జరిగింది. రిలీ ముల్లిన్స్ (28) అనే యువకుడు తన చేతిమీద త్రికోణాకారంలో టాటూ వేసుకున్నాడు. ఆమె పర్సు దొంగిలించిన తర్వాత, అందులో ఉన్న ఐడీ కార్డు మీద పేరు చూసి.. ఆ పేరును ఫేస్బుక్లో సెర్చ్ చేశాడు. దొరకడంతో వెంటనే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు.
ఆమె రోజూలాగే తన ఫేస్బుక్ చూసుకుంది. వచ్చిన రిక్వెస్ట్ చూసి, అతగాడి ఫొటో చూడగానే అనుమానం వచ్చింది. తీరా చూస్తే చేతిమీద త్రికోణాకారపు టాటూ కూడా ఉంది. వెంటనే అతడే తనమీద దాడిచేసి పర్సు దొంగిలించాడని గుర్తించి పోలీసులకు చెప్పడంతో.. వాళ్లు వచ్చి అతడికి అరదండాలు తగిలించి సమర్యాదగా తీసుకెళ్లారు.