ఎన్‌ఆర్‌ఐ భర్తల బాధితులకు అండ!
న్యూఢిల్లీ: ఎన్‌ఆర్‌ఐ భర్తలు వదిలేసిన మహిళలకు సహాయం చేసేందుకు ప్రభుత్వం త్వరలో వెబ్ పోర్టల్‌ను ప్రారంభించనుంది. ఇందులో లాయర్లు, ఈ రంగంలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు తదితరాలకు సంబంధించిన సమాచారం ఉంటుంది. గత వారం జరిగిన ప్రత్యేక కమిటీ సమావేశంలో వెబ్‌పోర్టల్‌ను తీసుకురావాలని నిర్ణయించారు. కమిటీలో మహిళా, శిశు సంక్షేమ శాఖ, విదేశాంగ శాఖ, హోం మంత్రిత్వ శాఖల నుంచి ఒక్కరేసి చొప్పున అధికారులున్నారు.
విదేశాల్లో భర్త వదిలేసినా, స్వదేశంలో విడాకులు పొందడానికి సమస్యలు ఎదుర్కొంటున్న, మనోవర్తి పొందగోరే మహిళలకు ఈ పోర్టల్ సహాయకారిగా నిలుస్తుందని భావిస్తున్నారు. అలాంటి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో గతేడాది ఏర్పడిన కమిటీ.. బాధితులకు అభివృద్ధి చెందిన దేశాల్లో 3 వేల డాలర్లు, వర్థమాన దేశాల్లో 2 వేల డాలర్లు ఆర్థిక సాయం చేయాలని ఇంతకు ముందే ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రతిపాదిత పోర్టల్‌ను విదేశాంగ శాఖ నిర్వహిస్తుంది.