3న కేంద్ర, రాష్ట్ర కేబినెట్ ప్రత్యేక సమావేశాలు
న్యూఢిల్లీ : డిసెంబర్ 3న కేంద్ర కేబినెట్ ప్రత్యేక భేటీ జరుగుతుందని కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. జీవోఎం ప్రతిపాదనలు కేబినెట్‌కు వివరిస్తామని ఆయన శుక్రవారమిక్కడ పేర్కొన్నారు. అదే రోజు జీవోఎం నివేదికను కేబినెట్ ఆమోదిస్తుందని షిండే తెలిపారు. కాగా ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశంకానుంది. తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర మంత్రుల బృందం రూపొందించిన ముసాయిదా బిల్లుపై సమావేశంలో చర్చించే అవకాశముంది.
జీవోఎం నివేదికపై కసరత్తు పూర్తి చేసినట్లు ప్రకటించినప్పటికీ... నిర్ణయాన్ని అమలుచేసే ముందు ఆచితూచి వ్యవహరించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకే సాయంత్రం జరిగే కోర్ కమిటీ సమావేశంలో నివేదికపై చర్చించిన తర్వాత కీలకాంశాలపై స్పష్టత ఏర్పడుతుందని... ఆపై అవసరమైతే బీజేపీ అగ్రనేతలతో చర్చించాల్సి ఉంటుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి.
కాగా డిసెంబర్ 3న సాయంత్రం 4 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. కేంద్ర కేబినెట్ ప్రత్యేక భేటీ జరగనున్న రోజునే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.