తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఆదివారం దారుణం చోటు చేసుకుంది. ఆలయ మహాద్వారం వద్ద ఎస్పీఎఫ్ కానిస్టేబుల్... ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థకు చెందిన వ్యక్తికి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆ క్రమంలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్పై ప్రైవేట్ సెక్యూరిటీ దాడి చేశాడు. దాంతో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ తలకు తీవ్రంగా గాయమైంది. సహాచర సిబ్బంది వెంటనే స్పందించి అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాధమిక చికిత్స అనంతరం అతడిని తిరుపతిలోని అశ్వనీ ఆసుపత్రికి ప్రత్యేక అంబులెన్స్లో తరలించారు.
ఈ సంఘటన జరిగిన సమయంలో టీటీడీ ఈవో డి.సాంబశివరావు కూతవేటు దూరంలోనే ఉన్నారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే సదరు సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు ఆయన కుటుంబసభ్యులు తిరుమల శ్రీవారి ఆలయానికి వస్తున్న సమయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
తిరుమలలో నారా లోకేష్, బ్రహ్మాణీ దంపతుల గారల పట్టి దేవాన్ష్ అన్నప్రసన నేడు శ్రీవారి ఆలయంలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుతోపాటు ఆయన కుటుంబ సభ్యులు... నందమూరి బాలకృష్ణ ఆయన కుటుంబ సభ్యులు నేడు తిరుమల రానున్నారు. అలాగే బ్రహ్మోత్సవాల సమయం కూడా కావడంతో తిరుమలలో రద్దీ బాగా పెరిగింది.