
శ్రీనగర్ ఉపఎన్నిక రక్తసిక్తం
► పెట్రోల్ బాంబులు, రాళ్లతో ఆందోళనకారుల బీభత్సం
► భద్రతా బలగాల కాల్పులు.. ఎనిమిది మంది మృతి
► వందమందికి పైగా జవాన్లకు గాయాలు
► పోలింగ్ కేవలం 7.14 శాతం
శ్రీనగర్/జైపూర్/భోపాల్: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ లోక్‌సభ స్థానానికి ఆదివారం జరిగిన ఉపఎన్నిక రక్తసిక్తంగా మారింది. పరిస్థితిని అదుపుచేసేందుకు భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 8 మంది ఆందోళనకారులు మృతిచెందారు. కాగా.. ఆందోళనకారుల విధ్వంసానికి బెడిసి ఓటర్లు బయటకు రాకపోవటంతో 7.14 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. శ్రీనగర్ నియోజకవర్గంలో పలుచోట్ల ఆందోళనకారులు గుంపులు గుంపులుగా వచ్చి పోలింగ్ బూత్‌లో విధ్వంసానికి పాల్పడ్డారు. పెట్రోల్ బాంబులతో బీభత్సం సృష్టించారు. దీంతో వీరిని అదుపుచేసేందుకు భద్రతా బలగాలు కాల్పులు జరిపారు.
ఈ ఘటనల్లో 8 మంది ఆందోళనకారులు మరణించగా పలువురికి గాయాలయ్యాయి. చాలాచోట్ల పోలీసులు, భద్రతా బలగాలపై రాళ్లతో దాడికి పాల్పడటంతో 100 మందికి పైగా జవాన్లకు గాయాలయ్యాయని ఎన్నికల అధికారి వెల్లడించారు. భద్రతాదళాల కాల్పుల్లో బుద్గాం జిల్లా చరారే షరీఫ్, బీర్వా ప్రాంతాల్లో ఇద్దరేసి చొప్పున, చదూరాలో ఒక్కరు చనిపోగా, మాగం పట్టణంలో మరొకరు చనిపోయారు. హింసాత్మక ఆందోళనల కారణంగా 70 శాతం పోలింగ్ బూత్‌లలో పనిచేసేందుకు పోలింగ్ సిబ్బంది నిరాకరించారని అధికారులు వెల్లడించారు. కాగా, ఘర్షణలు తలెత్తిన దాదాపు వంద బూత్‌లలో ఏప్రిల్ 12న రీపోలింగ్ నిర్వహించనున్నారు. కాగా, లోయలోని మరో సున్నిత ప్రాంతం అనంత్‌నాగ్ లోక్‌సభ స్థానానికి ఏప్రిల్ 12న ఉప ఎన్నిక నిర్వహించనున్నారు.
లోయలో విధ్వంసం
బుద్గాం జిల్లా చరారే షరీఫ్‌లో ఓ పోలింగ్ బూత్‌లోకి వందల సంఖ్యలో చొచ్చుకు వచ్చిన ఆందోళనకారులు పోలింగ్ సామాగ్రిని ధ్వంసం చేశారు. ఎన్నికల అధికారులపై దాడికి దిగారు. వీరిని అదుపు చేసేందుకు భద్రతా బలగాలు గాల్లోకి కాల్పులు జరిపినా లాభం లేకపోయింది. దీంతో నేరుగా ఆందోళనకారులపైనే కాల్పులు జరిపారు. ఇందులో మొహ్మద్ అబ్బాస్ (20), ఫైజాన్ అహ్మద్ (15)లు మరణించగా పలువురికి గాయాలయ్యాయి. బీర్వా ప్రాంతంలో పోలీసులపైకి రాళ్లు రువ్విన ఆందోళనకారులపై కాల్పులు జరపగా ఇద్దరు యువకులు మృతిచెందారు.
శ్రీనగర్ నియోజకవర్గం పరిధిలోని శ్రీనగర్, బుద్గాం, గండేర్‌బాల్ జిల్లాల్లోని దాదాపు 25 చోట్ల పోలీసులు, భద్రతా బలగాలపై రాళ్లు రువ్విన కేసులు నమోదయ్యాయని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీంతో ఆందోళనకర పరిస్థితులకు జడిసి జనాలు పోలింగ్‌బూత్‌లకు రాలేకపోయారన్నారు.
ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించటంలో సీఎం మెహబూబా ముఫ్తీ విఫలమయ్యారంటూ.. ఎన్సీపీ అధ్యక్షుడు, శ్రీనగర్ స్థానం నుంచి బరిలో ఉన్న అభ్యర్థి ఫారూఖ్ అబ్దుల్లా విమర్శించారు. అనంత్‌నాగ్ ఉప ఎన్నిక వరకు శ్రీనగర్‌లోనూ ఇంటర్నెట్ సేవలను రద్దుచేయనున్నారు. కాగా, ఎన్నికల ఘర్షణలో యువకులు ప్రాణాలు కోల్పోవటాన్ని నిరసిస్తూ వేర్పాటువాదులు సోమ, బుధవారాల్లో లోయలో బంద్‌కు పిలుపునిచ్చారు.
మిగిలిన చోట్ల ప్రశాంతం
శ్రీనగర్, మధ్యప్రదేశ్‌లోని రెండు స్థానాలు మినహా మిగిలిన 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాజస్తాన్ రాష్ట్రంలోని ఢోల్‌పూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో భారీగా పోలింగ్æ నమోదైంది. ఇక్కడ పలుచోట్ల ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు వచ్చినా వెంటనే వాటిని పరిష్కరించినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఎన్నికలు జరిగిన ఇతర స్థానాల్లో కర్ణాటకలో గుండుల్‌పేట్, ననజనగుడ్, అస్సాం రాష్ట్రంలోని ధేమాజీ, బెంగాల్‌లోని కాంతి దక్షిణ్, ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్ తదితరాలు ఉన్నాయి.
శ్రీనగర్‌లో గరిష్టం 26 శాతమే!
జమ్మూకశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్ లోక్‌సభ స్థానానికి ఆదివారం జరిగిన ఉపఎన్నికలో కేవలం 7.14 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. అయితే.. ఈ నియోజకవర్గంలో గరిష్టంగా 26 శాతం పోలింగ్ నమోదైంది. అదీ 2014 సార్వత్రిక ఎన్నికల్లోనే. 1999లో జరిగిన ఎన్నికల్లో 11.93 శాతం పోలింగ్ నమోదవగా.. ఎన్సీపీ నేత ఒమర్ అబ్దుల్లా చేతిలో ప్రస్తుత సీఎం మెహబూబా ముఫ్తీ ఓటమిపాలయ్యారు. 2014 ఎన్నికల్లో మాజీ సీఎం నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫారూఖ్ అబ్దుల్లా.. పీడీపీ నేత తారీక్ హమీద్ కర్రా చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే గతేడాది సెప్టెంబర్‌లో కర్రా పీడీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేయటంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది.
మధ్యప్రదేశ్‌లో బీజేపీ–కాంగ్రెస్ ఘర్షణ
మధ్యప్రదేశ్‌లోని అటెర్, బాంధవ్‌గఢ్ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికలు బీజేపీ–కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణకు దారితీశాయి. కాంగ్రెస్ అభ్యర్థి చాలాసేపు బూత్‌లోనే ఉండటంతో బీజేపీ ఏజెంట్లు అభ్యంతరం తెలపటంతో గొడవ మొదలైంది. పలు చోట్ల గుంపులను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారని రాష్ట్ర ఎన్నికల అధికారి తెలిపారు.