స్టాక్ మార్కెట్కు మోడీ జోరు
స్టాక్ మార్కెట్లు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. ఎన్నికల్లో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏకి 200కు పైగా సీట్లు వస్తాయని సర్వేలు ఖాయంగా చెబుతుండటంతో విదేశీ ఇన్వెస్టర్లకు నమ్మకం కుదురుతోంది. వారు భారీగా నిధులు కుమ్మరిస్తుండటంతో స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయిలో పెరుగుతోంది. గడిచిన ఆరేళ్లుగా స్టాక్ మార్కెట్లు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉన్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లకు మార్కెట్లపై నమ్మకం తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో ఏడు నెలల కిందట బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రకటించడంతో మార్కెట్లోని ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. షేర్లు పరుగులు దేశాయి. విదేశీ నిధులు వెల్లువలా వచ్చాయి.
జనవరి నాటికి మార్కెట్ 2,500 పాయింట్ల దాకా పెరిగి 21వేలకు వచ్చింది. తర్వాత మళ్లీ మార్కెట్లు కొంత నష్టపోయాయి. సెన్సెక్స్ 1000 పాయింట్ల దాకా పడింది. రెండు వారాలుగా మళ్లీ ఇన్వెస్టర్లలో ఉత్సాహం వస్తోంది. బీజేపీ అడ్డంకుల్ని అధిగమిస్తూ కొత్త పార్టీలను ఎన్డీయే కూటమిలోకి తీసుకువస్తుండటంతో విదేశీ ఇన్వెస్టర్లలో నమ్మకం పెరుగుతోంది. ఎన్డీయే సాధారణ మెజార్టీకి దగ్గర్లోకి వచ్చే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. 200 సీట్లకు పైనే రావొచ్చని లెక్కలు వేస్తున్నాయి. తాజాగా ఎన్డీయే కూటమిలోకి రాంవిలాస్ పాశ్వాన్ పార్టీ ఎల్జేపీ, విజయ్‌కాంత్ పార్టీ డీఎండీకే, రాందాస్ పార్టీ పీఎంకే రావడంతో మోడీ బలం పెరిగింది. ఈ పొత్తుల వల్ల 10 నుంచి 15 సీట్లు అదనంగా వస్తాయని భావిస్తున్నారు.
మోడీపై నమ్మకం పెరుగుతుండటంతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో గత నాలుగు రోజులుగా భారీగా పెట్టుబడులు పెట్టారు. నిఫ్టీ ఫ్యూచర్స్‌లో 2,300 కోట్ల రూపాయలు, క్యాష్ మార్కెట్లో 2,200 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. ఈ పెట్టుబడుల వల్ల సెన్సెక్స్ 21,525 పాయింట్ల సరికొత్త గరిష్ఠ స్థాయిని తాకింది. ఇది ఎన్నికల ముందు వస్తున్న ర్యాలీ అని ఇండియా ఇన్ఫోలైన్ ఛైర్మన్ నిర్మల్ జైన్ చెప్పారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు స్థిరమైన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారనే నమ్మకం ఇన్వెస్టర్లలో పెరుగుతోందని ఆయన తెలిపారు. రోజు రోజుకు ఈ నమ్మకం బలపడుతోందని జైన్ అభిప్రాయపడ్డారు.
ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నట్లు నరేంద్ర మోడీ సాధారణ మెజార్టీ సాధిస్తే సెన్సెక్స్ వచ్చే డిసెంబరు నాటికి 24 వేల పాయింట్లకు వెళుతుందని దైషీ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ అభయ్ లైజావాలా అంచనా వేశారు. మోడీ ప్రధాని కాలేకపోతే, ప్రత్యామ్నాయంగా మరో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడలేకపోతే సెన్సెక్స్ 10 శాతం నష్టపోయే అవకాశం ఉందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అంటే ప్రస్తుత స్థాయి నుంచి సెన్సెక్స్ 19 వేలకు పడే అవకాశం ఉంది. అయితే ఇలా జరిగే ఛాన్స్ చాలా తక్కువ అని ఎక్కువ శాతం మంది అనలిస్టులు చెబుతున్నారు.