
నటుడి ఆత్మహత్యాయత్నం.. అనూహ్య మలుపు!
సినీ పరిశ్రమలో నిలుదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న 23 ఏళ్ల ఓ వర్ధమాన నటుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
సినీ పరిశ్రమలో నిలుదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న 23 ఏళ్ల ఓ వర్ధమాన నటుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కానీ, అతని తల్లి చివరినిమిషంలో పోలీసులకు ఫోన్ చేయడంతో అతని ప్రాణాలను పోలీసులు కాపాడగలిగారు. అనూహ్య మలుపులు తిరిగిన ఈ ఘటన ముంబై గోరేగావ్ ఈస్ట్‌లోని వన్రాయి కాలనీలో జరిగింది.
వన్రాయి కాలనీలోని ఓ ఫ్లాట్‌లో నివాసముంటున్న సదరు యువనటుడు శనివారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ విషయం తెలిసిన నిస్సహాయురాలైన తల్లి పూజ శనివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో స్థానిక పోలీసులకు ఫోన్ చేసింది. తన కొడుకు పరిస్థితి వివరించి సాయం చేయాలని వేడుకుంది. అప్పుడు డ్యూటీలో ఉన్న సబ్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రజీత్ పాటిల్ వెంటనే తన సిబ్బందిని తీసుకొని ఆమె ఇచ్చిన చిరునామాకు వెళ్లాడు. ఫ్లాట్ తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లిన పోలీసులకు నటుడు అపస్మారక స్థితిలో కనిపించాడు. చేతి మణికట్టు, గొంతు కోసుకున్న అతను బాత్రూమ్‌లో రక్తపుమడుగులో పడి ఉన్నాడు. పోలీసులు అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న అతనికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
ఈ ఘటన గురించి పోలీసులు విచారించగా ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న సదరు నటుడు తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు వాట్సాప్‌లో తన స్నేహితులకు నోట్ పంపించాడు. దీంతో పలువురు స్నేహితులు అతన్ని కలిసేందుకు ప్రయత్నించారు. అయినా వీలుపడకపోవడంతో అతని పిన్ని రాజశ్రీకి సమాచారమిచ్చారు. ఆమె అతని తల్లి పూజకు ఫోన్ చేసి చెప్పింది. కొడుకు ప్రాణాలను ఎలాగైనా కాపాడాలనుకున్న ఆ తల్లి ఇంటర్నెట్ ద్వారా స్థానిక పోలీసు స్టేషన్ ఫోన్‌నెంబర్‌ను కనుక్కొని.. ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో కథ సుఖాంతమైంది.