మహారాష్ట్రలోని ముంబై, నవీ ముంబైలను కలిపే అటల్ సేతు బ్రిడ్జి (ముంబై ట్రాన్స్ హర్బర్ లింక్) గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ బ్రిడ్జిపై ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన అనేక కేసులు నమోదవుతున్నాయి. ఆత్మహత్యలు చేసుకునే వారికి ఈ బ్రిడ్జి ఒక స్పాట్‌గా మారింది. ఇటీవల ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే.. తాజాగా మరో మహిళ బలవన్మరనానికి యత్నించింది.
అయితే వెంటనే స్పందించిన కారు డ్రైవర్, ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై.. ఆమెను కాపాడటంతో రెప్పపాటులో ప్రాణాలతో బయటపడింది. శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. 56 ఏళ్ల రీమా ముఖేష్ పటేల్ ముంబైలోని ములుండ్‌లో నివసిస్తున్నారు.
ఏం కష్టం వచ్చిందో ఏమో గానీ క్యాబ్‌లో అటల్ సేతు బ్రిడ్జి వద్దకు వచ్చింది. కారు దిగి సముద్రంలోకి ఏదో విసిరినట్లు చేసి వెంటనే నీళ్లలోకి దూకేందుకు యత్నించింది. దీనిని గమనించిన డ్రైవర్ వెంటనే ఆమెను పట్టుకున్నాడు. ఆమె సముద్రంలోకి పడిపోకుండా జుట్టు పట్టుకొని ఆపాడు.
అదే సమయంలో పెట్రోలింగ్ వాహనం కూడా అక్కడికి రావడంతో.. ట్రాఫిక్ పోలీసులు చాకచక్యంగా స్పందించి ఆమెను రెస్క్యూ చేశారు. దీంతో మహిళ రెప్పపాటులో ప్రాణాలతో బయటపడింది. మహిళను డ్రైవర్, పోలీసులు జాగ్రత్తగా పైకి లాగుతున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.
ఈ వీడియోను ముంబై పోలీసులు తమ ట్విటర్‌లో షేర్ చేశారు.‘అటల్ సేతు బ్రిడ్జి రైలింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన మహిళను గమనించిన డ్యూటీ అధికారులు, లలిత్ షిర్సత్, కిరణ్ మహత్రే, యశ్ సోనావానే, మయూర్ పాటిల్ వెంటనే స్పందించి కాపాడారు’ అని ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్ తెలిపారు.
అదే విధంగా జీవితం ఎంతో విలువైనది అని, దానిని గౌరవించాలని తెలిపారు. ఎలాంటి కారణాలతోనూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, ఒక్క క్షణం మిమ్మల్ని ప్రేమించే మీ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment