ప్రధాని ర్యాలీకి బాంబు బెదిరింపు
ప్రధాని ర్యాలీకి బాంబు బెదిరింపు
Published Tue, Feb 28 2017 9:30 AM | Last Updated on Fri, Nov 9 2018 5:06 PM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన పెద్దనోట్ల రద్దుతో కోపం వచ్చిన ఓ విద్యార్థి.. ఆయన ఉత్తరప్రదేశ్‌లో పాల్గొంటున్న ఎన్నికల ర్యాలీలో బాంబులు పేలుతాయంటూ ఉత్తుత్తిగా బెదిరించాడు. అలా ఫోన్ చేసినందుకు ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్న ఆ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. దీపక్ అనే ఆ విద్యార్థి సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ చేశాడు. దాంతో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమై మావు వద్ద భద్రత పెంచారు. అది ఉత్తుత్త బెదిరింపు అని అనుమానం వచ్చినా, ప్రధానమంత్రి పాల్గొంటున్న ర్యాలీ కావడంతో అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యారు. ఇంటెలిజెన్స్ బ్యూరో, ఏటీఎస్ కూడా రంగంలోకి దిగాయి.
ఏసీపీ హుక్మారామ్ దీనిపై దర్యాప్తు చేసి దీపక్(21)ను అరెస్టు చేశారు. ఆ కాల్ నైరుతి ఢిల్లీలోని లాల్‌బాగ్ ప్రాంతం నుంచి వచ్చినట్లు గుర్తించారు. దీపక్ వద్ద ఒక డైరీ స్వాధీనం చేసుకుని చూడగా, అందులో ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాల ప్రసంగాలు రాసుకున్నట్లు కనిపించింది. అతడు లాల్‌బాగ్ ప్రాంతంలో నివసిస్తాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఆజాంగఢ్ అతడి స్వస్థలం. ఢిల్లీ యూనివర్సిటీలో కరస్పాండెన్స్ కోర్సు చేస్తూ తమ బంధువుల వద్ద ఉంటున్నాడు. ర్యాలీని భగ్నం చేసేందుకే తాను ఆ ఫోన్ కాల్ చేశానన్నాడు.
Advertisement