మెస్‌ చార్జీల పెంపు | students mess charges hiked, CM KCR announced in Assembly | Sakshi
Sakshi News home page

మెస్‌ చార్జీల పెంపు

Published Tue, Mar 28 2017 2:16 AM | Last Updated on Fri, Nov 9 2018 4:45 PM

మెస్‌ చార్జీల పెంపు - Sakshi

మెస్‌ చార్జీల పెంపు

- 18 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి: సీఎం
- పెంపును వెంటనే అమల్లోకి తెస్తాం.. హోంగార్డులకు రెగ్యులర్‌ ఉద్యోగాలిస్తాం
- ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించి వేతనాలు పెంచుతాం
- ఆశా వర్కర్లకు, సెకండ్‌ ఏఎన్‌ఎంలకు భృతి పెంపు
- మరో 81 వేల మంది బీడీ కార్మికులకు పెన్షన్‌
- ఇంట్లో ఒకరికి పెన్షన్‌ వచ్చినా.. మరొకరికి ఇస్తాం.. వచ్చే ఏడాది బీసీలకు సబ్‌ప్లాన్‌
- మైనారిటీలు, గిరిజనుల రిజర్వేషన్ల పెంపుపై వారంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశం  


సాక్షి, హైదరాబాద్‌
రాష్ట్రంలో పాఠశాలలు, కాలేజీలు, గురుకులాలు, వృత్తి విద్యా కోర్సులు చదివే విద్యార్థులకు ప్రతినెలా ఇచ్చే మెస్‌ చార్జీలను పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ పెంపు ద్వారా 18 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై సభ్యులు లేవనెత్తిన వివిధ అంశాలపై ఆయన సమాధానం ఇచ్చారు. విద్యార్థుల మెస్‌ చార్జీలు పెంచాలని విజ్ఞప్తులు వచ్చాయని, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన నియమించిన సబ్‌ కమిటీ కూడా ఈ మేరకు సిఫారసు చేసిందని సీఎం వివరించారు.

మెస్‌ చార్జీల పెంపును వెంటనే అమల్లోకి తెస్తామని, దీంతో ప్రభుత్వ హాస్టళ్లలో 4 లక్షలకుపైగా, కాలేజీ అటాచ్డ్‌ హాస్టళ్లు, స్టూడెంట్‌ మేనేజ్డ్‌ హాస్టళ్లు, డే స్కాలర్‌ స్టూడెంట్స్‌ 13 లక్షల మందికి పైగా లబ్ధి పొందుతారన్నారు. వారందరి మెస్‌ చార్జీల పెంపు కోసం ఏటా ప్రభుత్వం అదనంగా రూ.117 కోట్లు వెచ్చిస్తుందన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టామని, వారి వేతనాలు పెంచుతామని తెలిపారు. హోంగార్డులను రెగ్యులర్‌ ఉద్యోగులుగా మారుస్తామన్నారు. ఆశా వర్కర్లు కేంద్ర పథకం పరిధిలో పనిచేస్తున్నారని, అయినా వారితోపాటు రెండో ఏఎన్‌ఎంలకు కూడా భృతిని పెంచుతామన్నారు. రాష్ట్రంలో ఏ వర్గాన్నీ నిర్లక్ష్యం చేయబోమని స్పష్టంచేశారు. తమిళనాడు తరహాలో రాష్ట్రంలోనూ రిజర్వేషన్లకు అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని, సుప్రీంకోర్టును కోరుతామని చెప్పారు. బీసీల రిజర్వేషన్ల పెంపునకు సానుకూలంగా ఉన్నామని, వాటిపై 6 నెలల పాటు లోతుగా అధ్యయనం చేయాలని బీసీ కమిషన్‌కు చెబుతామన్నారు. తాము మతపరమైన రిజర్వేషన్లను ప్రతిపాదించడం లేదని, ఇప్పటికే అమలవుతున్న రిజర్వేషన్లను పెంచుతామని వివరించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం గిరిజనులు, మైనార్టీల రిజర్వేషన్లు పెంచుతామని స్పష్టంచేశారు. వారం రోజుల్లో రిజర్వేషన్లపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ జరుపుతామని వెల్లడించారు.

సంక్షేమంలో అగ్రస్థానంలో ఉన్నాం..
సంక్షేమ రంగంలోనే దేశంలో అగ్రస్థానంలో ఉన్నామని సీఎం కేసీఆర్‌ ఉద్ఘాటించారు. ‘‘ఒంటరి మహిళలకు జీవన భృతి కల్పిస్తున్నాం. 3.71 లక్షల మంది బీడీ కార్మికులకు నెలకు రూ.1000 చొప్పున పెన్షన్‌ ఇస్తున్నాం. ఇప్పటివరకు ఇంట్లో ఎవరికైనా పెన్షన్‌ వస్తే ఇంకొకరికి బీడీ పెన్షన్‌ ఇవ్వడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి వారికి కూడా బీడీ కార్మికుల పెన్షన్‌ ఇస్తాం. దీంతో మరో 81 వేల మంది లబ్ధి పొందుతారు’’అని చెప్పారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు అమలు చేస్తున్నామని, పేదలకు సంపదను పంచుతున్నామని వివరించారు. ఈ ఏడాది రైతు రుణమాఫీ పూర్తవుతుందన్నారు. దళితులకు వచ్చే ఏడాది బడ్జెట్‌లో ప్రత్యేకంగా రూ.1,000 నుంచి రూ.1,500 కోట్లు కేటాయిస్తామని వివరించారు. చేనేత కార్మికులకు నెలకు రూ.15 వేలు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. రూ.1,500 కోట్లతో మున్సిపాలిటీల అభివృద్ధికి చర్యలు చేపడతామని తెలిపారు. పారిశ్రామిక పెట్టుబడుల విషయంలో 6వ స్థానంలో ఉన్నామని, ఒకటో స్థానం పొందేందుకు కృషిచేస్తామన్నారు.

వచ్చే ఏడాది బీసీ సబ్‌ప్లాన్‌
వచ్చే ఆర్థిక సంవత్సరంలో బీసీ సబ్‌ ప్లాన్‌ తెస్తామని, ఈ మేరకు సభలో చట్టాన్ని చేస్తామని సీఎం చెప్పారు. రెండు మూడు నెలల్లో కొత్త పోలీస్‌ స్టేషన్లకు 10 వేల మంది కానిస్టేబుళ్లు వస్తారని, పాలన గాడిలో పడుతుందని పేర్కొన్నారు. గుడుంబా నిర్మూలనకు చర్యలు చేపట్టామని, మద్య నిషేధంపై ఏం చేయాలన్నది ఆలోచిస్తామన్నారు. కాంట్రాక్టర్ల వద్ద ఉండే వారు కాకుండా, సింగరేణి సంస్థ పరిధిలో ఇంకా కాంట్రాక్టు సిబ్బంది ఉంటే రెగ్యులరైజ్‌ చేస్తామన్నారు. డిస్మిస్‌ అయినవారు ఇంకా ఎవరైనా ఉంటే ఉద్యోగంలోకి తీసుకుంటామన్నారు. వారసత్వ ఉద్యోగాలపై కేసు కోర్టులో ఉందని, కార్మికుల బాధలను కోర్టుకు తెలియజేయాలని ఏజీకి చెప్పామని వివరించారు.

భయంకర పరిస్థితులను చక్కదిద్దాం
గతంలో పారిశ్రామికవేత్తలు, రైతుల ధర్నాలు, పంటలు ఎండిపోయి ఆత్మహత్యలు వంటి భయంకర పరిస్థితులు ఉండేవని, తాము వచ్చాక వాటన్నింటినీ చక్కదిద్దామని సీఎం వివరించారు. విద్యుత్‌ రంగపై రెండున్నరేళ్లలో రూ.12,136 కోట్లు ఖర్చు చేశామన్నారు. సంపన్న దేశమైన అమెరికాకు కూడా అప్పు ఎక్కువేనని, మారుతున్న ఆర్థిక విధానాలను అనుగుణంగా ముందుకు సాగాలన్నారు. తాము ‘మిక్స్‌డ్‌ ఎకానమీ’విధానం పాటిస్తున్నామన్నారు. పంటలపై రైతులకు బోనస్‌ ఇచ్చే అంశంపై సంబంధిత మంత్రి, అధికారులతో కర్ణాటకలో అధ్యయనం చేయిస్తామన్నారు. రూ.1000 కోట్లతో మైక్రో ఇరిగేషన్‌కు చర్యలు చేపడతామన్నారు. కమర్షియల్‌ టాక్స్‌ బకాయిల విషయంలో కేసులున్నాయని, వాటిపై చీఫ్‌ జస్టిస్‌ను కలసి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని విన్నవిస్తామని తెలిపారు.

కేజీ టు పీజీ నా డ్రీమ్‌ ప్రాజెక్టు
కేజీ టు పీజీ తన డ్రీమ్‌ ప్రాజెక్టు అని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో విద్యావిధానం అమలు కావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల పరిధిలోకి తెస్తున్నామని, ఇవన్నీ కేజీ టు పీజీలో భాగమేనని వివరించారు. గురుకులాల ఏర్పాటుతో కేజీ టు పీజీ ప్రాజెక్టులో పటిష్టమైన ముందడుగు వేశామన్నారు. రాబోయే రోజుల్లో గురుకులాల్లో ఏటా 8 వేల చొప్పున 24 వేల టీచర్‌ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు.

మంచి పనులను అడ్డుకుంటున్నారు
మిషన్‌ భగీరథ ప్రాజెక్టును నీతి ఆయోగ్‌ కూడా మోడల్‌గా తీసుకుందని, జాతీయ స్థాయిలోనూ దీని అమలుకు ఆలోచిస్తోందని సీఎం చెప్పారు. ప్రజల కోసం తాము ఇలా మంచి పనులు చేస్తుంటే.. ప్రతిపక్షాలు అవినీతి అంటూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఈ పనులు పూర్తయితే రాజకీయంగా తమకు దెబ్బ పడుతుందన్నదే వారి బాధ అని విమర్శించారు. తాగు, సాగునీటి ప్రాజెక్టులకు అడ్డుపడొద్దని, ప్రగతి నిరోధకులు కావొద్దని హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement