
నోట్ల రద్దుపై స్వామి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఆపరేషన్ బ్లాక్ మనీపై బీజేపీ ఎంపీ, ఫైర్ బ్రాండ్ సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. డీమానిటైజేషన్ పథకంపై ప్రభుత్వానికి సరియైన ప్రణాళిక లేదని మండిపడ్డారు. పెద్దనోట్ల రద్దు, కొత్తనోట్ల జారీ ప్రక్రియలో పేలవమైన ప్రణాళిక,అమలు కారణంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. పేలవమైన ప్రణాళికతో తీసుకున్న ఆర్థికశాఖ చర్య దేశాన్ని అయోమయంలోకి నెట్టేసిందన్నారు.
తమ తప్పులేదని ఆర్థికశాఖ వాదించడం సులభమేకానీ, ఆకస్మికచర్యలు చేపట్టకపోవడం క్షమించరానిదని ధ్వజమెత్తారు. ఈ విషయంలో ఆర్థికమంత్రిత్వ శాఖ సరియైన ఏర్పాట్లు చేయకపోవడం తనను బాధించిందని పేర్కొన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కూడా అయిన అవినీతి నిరోధంపై ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు హాంగ్ కాంగ్ వెళ్లిన స్వామి ఈ వ్యాఖ్యలు చేసినట్టు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ రిపోర్ట్ చేసింది.
కాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నవంబరు 8న రూ. 500, 1,000 నోట్ల చలామణి రద్దు చేయడంతో దేశంలో కలకలం రేపింది. ఏటీఎం కేంద్రాల వద్ద, బ్యాంకుల వద్ద ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అటు ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిస్థితిని చక్కదిద్దడానికి మల్లగుల్లాలు పడుతోంది. అటు 50 రోజులు సహకరిస్తే ప్రజలు కోరుకున్న భారతాన్నిస్తానన్నారు. అవినీతిపై మొదలుపెట్టిన పోరాటం ఆగదని, తను తప్పుచేశానని భావిస్తే బహిరంగంగా ఉరేయమంటూ ఉద్వేగంగా గోవాలో ప్రకటించిన సంగతి తెలిసిందే.