మరో పెళ్లికి సిద్ధమైన భర్తపై భార్య.. !
ఇద్దరు పిల్లల్ని, తనని రోడ్డుపాలు చేస్తూ మరో పెళ్ళికి సిద్ధమైన భర్తకి వ్యతిరేకంగా ఓ మహిళ పోరుబాటపట్టింది.
బంజారాహిల్స్: ఇద్దరు పిల్లల్ని, తనని రోడ్డుపాలు చేస్తూ మరో పెళ్ళికి సిద్ధమైన భర్తకి వ్యతిరేకంగా ఓ మహిళ పోరుబాటపట్టింది. గత మూడు రోజులుగా అత్తింటి ముందు సుజాత అనే మహిళ దీక్ష కొనసాగిస్తోంది. వివరాలివి..
ఫిలింనగర్‌లోని భగత్‌సింగ్ కాలనీకి చెందిన బీజేపీ నేత ఎస్పీ శ్రీను కొడుకు అశోక్ ఫిలింనగర్‌లోని నవనిర్మాణ్ నగర్ బస్తీలో నివసించే సుజాతను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. అయితే, తాను సుజాతను పెళ్ళి చేసుకోలేదని, ఆమెతో సహజీవనం మాత్రమే చేశానని అశోక్ వాదిస్తున్నాడు. ఆమె మొదటి కొడుకు తనకు పుట్టలేదని, చిన్న కొడుకు మాత్రమే తనకు పుట్టాడని పేర్కొనడమే కాకుండా.. మరో పెళ్లికి అతను సిద్ధం కావడంతో పోలీసులు అశోక్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ నేపథ్యంలో తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు శుక్రవారం నుంచి అత్తింటి ముందే టెంటు వేసుకొని దీక్షకు దిగింది. అక్కడే అక్కడే వంటావార్పు చేసుకుంటూ ఆందోళన కొనసాగిస్తున్నది. ఆమెకు ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, బస్తీ సంక్షేమ సంఘాలు, వివిధ పార్టీల రాజకీయ నేతలు అండగా నిలిచారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆమె హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి గోడు వెళ్లబోసుకుంది. రోడ్డునపడ్డ మహిళకు న్యాయం చేయాలని, అత్తింట్లోనే ఒక గదిలో ఆమెకు ఆశ్రయం కల్పించాలని హోం మంత్రి బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డిని ఆదేశించారు. అయితే అది కుదరకపోవడంతో సుజాత అత్తింటిముందే యథాప్రకారంగా ఆదివారం కూడా దీక్ష కొనసాగించింది.