
హోంమంత్రి ఆదేశాలు : అత్తింట్లోకి సుజాత
హైదరాబాద్: మూడు రోజులుగా అత్తింటి ముందు న్యాయం కోసం దీక్ష చేపట్టిన సుజాత హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆదేశాలతో ఎట్టకేలకు అత్తింట్లోకి అడుగు పెట్టింది. ఫిలింనగర్‌లోని భగత్‌సింగ్ కాలనీలో నివసించే బీజేపీ నేత ఎస్‌పీ.శ్రీను కొడుకు అశోక్ 2004లో నవనిర్మాణ్‌నగర్ బస్తీకి చెందిన సుజాతను ప్రేమ పేరుతో కొద్ది రోజులు సహజీవనం చేసి పెద్దలకు తెలియకుండా పెళ్ళి చేసుకున్నాడు. (చదవండి : ‘అరేయ్..ఒరేయ్ అంటోంది’.. అందుకే.. )
వీరికి ఇద్దరు పిల్లలు కలిగారు. ఇటీవల అశోక్ మరో వివాహం చేసుకోవడానికి పథకం వేసుకొని సుజాతను దూరం పెట్టాడు. దీంతో ఆమె రోడ్డున పడింది. న్యాయం కోసం అత్తింటి ముందే టెంటు వేసుకొని దీక్ష చేపట్టింది. హోం మంత్రిని కలవగా ఆమెను అత్తింట్లోకి పంపించాల్సిందిగా బంజారాహిల్స్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సోమవారం ఉదయం స్థానిక మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, బస్తీ సంక్షేమ సంఘాల మద్దతుతో అత్తింటి గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఖాళీగా ఉన్న గదిలోకి వెళ్లింది.